న్యూఢిల్లీ : వ్యక్తిగత డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్‌పై అభిప్రాయ సేకరణ గడువును జనవరి 2 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలువురు వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ బిల్లుపై సంప్రదింపులు, అభిప్రాయాల వెల్లడి కోసం డిసెంబర్ 17 తుది గడువుగా తొలుత ప్రకటించింది. దీన్ని పొడిగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అభిప్రాయాలను మైగౌట్ పోర్టల్ లేదా మంత్రిత్వ శాఖ అధికార ఇ-మెయిల్‌కు పంపడానికి వీలుందని తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణకు విడుదల చేసింది.
తొలుత 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవడంతో అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ క్రమంలో ఎనభైకి పైగా సవరణలు, పదికిపైగా కీలకమైన సూచనలలో కేంద్రం మరోసారి 'డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022'ను సిద్ధం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ఈ బిల్లులో ముఖ్యంగా దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైతే ప్రజల సమ్మతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవచ్చన్న నిబంధనలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని మరింతగా దెబ్బతీస్తుందనే ఆందో ళన ఉన్నందువల్ల దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగవలసిన అవసరం ఉంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం ఈ తాజా ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అంశాలు లోప భూయిష్టంగా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










