- కనీస కూలి దక్కక ఆర్థిక ఇబ్బందులు
- కానరాని భద్రతా సౌకర్యాలు
- ప్రమాదపుటంచుల్లో పనుల నిర్వహణ
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడ సీ పోర్టు ప్రయివేట్ లిమిటెడ్ (కెఎస్‌పిఎల్), యాంకరేజ్ పోర్టుల్లో పనిచేస్తున్న వివిధ రకాల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. వారికి కనీస కూలి దక్కడం లేదు. దీంతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి, దిగుమతి కూలీలతోపాటు సర్వేయర్ అండ్ టాలీ, బాలబంధు (బస్తాలు కుట్టేవారు), స్వీపర్లు, బార్జీలకు పెయింటింగ్, ఫిట్టింగ్ పనులు చేసే ఫ్యాబ్రికేటర్లు ఇలా సుమారు 20 వేల మంది కార్మికులు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేస్తున్నా కష్టానికి తగ్గ ఫలితం ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే అండ్ టాలీ వర్కర్లు సుమారు రెండు వేల మంది పని చేస్తున్నారు. సరుకు సక్రమంగా వచ్చిందా? లేదా? అనేది సరిచూడడంతోపాటు ఎంత సరుకు వచ్చిందనేది వీరు లెక్కిస్తుంటారు. వీరంతా మధ్యవర్తి ద్వారా పనులకు వెళుతున్నారు. 10 నుంచి 12 గంటలు కష్టపడితే రోజుకు రూ.300 మాత్రమే వీరికి కూలి ఇస్తున్నారు. ప్రతి కార్మికుని వద్ద మధ్యవర్తి రూ.50 కమీషన్‌గా తీసుకోగా మిగిలిన రూ.250 మాత్రమే కార్మికులకు దక్కుతోంది. ఎగుమతి, దిగుమతుల్లో పనిచేస్తున్న హమాలీలు సుమారు పది వేల మంది ఉన్నారు. వీళ్లకు పీస్ రేటు ప్రకారం ఒక్కో బస్తాకు రూ.4 మాత్రమే ఇస్తున్నారు. 10 గంటల నుంచి 12 గంటలపాటు పని చేస్తే 100 నుంచి 130 బస్తాలు మాత్రమే ఎగుమతి, దిగుమతి చేయగలుగుతున్నారు. రూ.400 నుంచి రూ.520 మాత్రమే కూలి దక్కుతోంది. పని చేయించుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు కూలీలకు కనీస వేతనాలను ఇవ్వట్లేదు. మధ్యవర్తుల ద్వారా పనుల్లో పెట్టుకుంటున్నందున కాంట్రాక్ట్ సంస్థలు ఎటువంటి కనీస సదుపాయాలూ కల్పించడం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా బయటకు పొక్కనీయకుండా తొక్కిపెడుతున్నాయి. కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో వైద్యం కూడా చేయించట్లేదని పలువురు కార్మికులు వాపోతున్నారు. సీపోర్టు ద్వారా జనరల్ సరుకులు, రైస్, మొక్కజొన్న, షుగర్, ఫెర్టిలైజర్స్, బొగ్గు, ఐరన్, సుద్ధరాయి, బాక్సైట్, గ్రానైట్ రాళ్లు, క్రూడ్ ఆయిల్ దిగుమతులు జరుగుతున్నాయి. దుమ్ము, ధూళిలో కార్మికులు పనిచేయాల్సి వస్తోంది. దీంతో, పలువురు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులకు ప్రభుత్వం నుంచి సౌకర్యాలు అందేలా, భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన కార్మిక, పరిశ్రమ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిఎఫ్, ఇఎస్‌ఐ వంటివి అమలు కావడం లేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకుని కూలి రేట్లు పెంచాలని, చట్టబద్ధంగా కల్పించాల్సినవన్నీ అమలు చేయాలనికార్మికులు కోరుతున్నారు..

కనీస కూలి రేట్లు పెంచాలి
నేను 25 ఏళ్లుగా పోర్టులో పనిచేస్తున్నాను. పొద్దస్తమానూ కష్టపడితే రూ.250 మాత్రమే వస్తోంది. కాంట్రాక్ట్ సంస్థలు, పోర్టు యాజమాన్యం స్పందించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి.
- పి.కుమారస్వామి, సర్వే అండ్ టాలీ కార్మికుడు

పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు లేవు
ప్రమాదకర చోట్ల పనిచేసే కార్మికులకు కనీస భద్రత కరువైంది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ అమలవ్వట్లేదు. ప్రమాదాల సందర్భంలో సరైన నష్టపరిహారం చెల్లించడం లేదు. పోర్టు లోపల ఆస్పత్రి సౌకర్యం లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది.
- టి. వీర వెంకటరమణ, ఎగుమతి, దిగుమతి జట్టు యూనియన్ అధ్యక్షుడు, కాకినాడ పోర్ట్










