Apr 23,2023 06:49
  •  కేంద్ర పథకంలో చేరడంతో రంగంలోకి ప్రైవేటు కంపెనీలు
  •  రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం
  •  ఆనక పలు కొర్రీలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తుల వలన ఏ సీజన్‌లో పంటలు నష్టపోతే ఆ సీజన్‌లోనే రైతులకు బీమా చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరేలా కనిపించట్లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం సొంతంగా ఇన్సూరెన్స్‌్‌ను నిర్వహించగా, ఈ ఏడాది నుంచి కేంద్ర పథకం ఫసల్‌ బీమా స్కీంలో చేరడంతో ఎప్పటి పరిహారం అప్పుడేనన్న వాగ్దానం అమలు అసాధ్యంగా పరిణమించింది. పంటల బీమాలో తిరిగి ప్రైవేటు కంపెనీలకు ఆస్కారం కల్పించడం వలన బీమా క్లెయిముల పరిష్కారం ఒక పట్టాన తేలేలా లేవు. రైతులకు చెల్లింపులు బాగా ఆలస్యం కానున్నాయి. వైసిపి అధికారంలోకొచ్చాక రైతుల కోసం 'వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా' పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019-20 రబీ నుంచి 2021-22 వరకు ఖరీఫ్‌, రబీలో ఉచిత బీమా అమలు చేసింది. గతంలో రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. ప్రీమియంలో తతిమ్మా భాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేవి. ఉచిత పంటల బీమా అనడంతో రైతులు అస్సలు చెల్లించవలసినపనిలేదు. కేంద్ర పథకాలతో తెగతెంపులు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో బీమా పథకాలను అమలు చేసింది. దాంతో ఇన్నేళ్లల్లో కేంద్రం తన వాటా ప్రీమియం నిధులను రాష్ట్రానికి ఇవ్వలేదు.

  • మళ్లీ కంపెనీలు

కొన్నేళ్లుగా కేంద్రం నుంచి నిధులు రానందువలన, తమ పథకాల్లో చేరమని కేంద్రం చేసిన ఒత్తిడి ఫలితంగా, తిరిగి రాష్ట్ర సర్కారు కేంద్ర బీమా పథకాల్లో చేరింది. 2022-23 ఖరీఫ్‌, రబీలో దిగుబడి ఆధారంగా ఫసల్‌బీమా, వాతావరణ డేటా ఆధారంగా వాతావరణ బీమా పథకాల్లో వాతావరణ బీమా అమలుకు తిరిగి రాష్ట్ర సర్కారే నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఫసల్‌బీమాకు మాత్రం బిడ్ల ద్వారా తొమ్మిది క్లస్టర్లకు కంపెనీలను ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఐసితో పాటు రిలయన్స్‌ జిఐసి, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, ఇఫ్కో టోకియో, ఎస్‌బిఐ జిఐసి కంపెనీలు నోడల్‌ ఏజెన్సీలుగా ఎంపికయ్యాయి. పంట కోత ప్రయోగాల్లో వచ్చిన దిగుబడి గణాంకాల ఆధారంగా ఇన్సూరెన్స్‌ క్లెయిములు సెటిల్‌ చేయాలి. ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ డేటాను అంగీకరించట్లేదు. వాటికవే డేటా సేకరిస్తుండటంతో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి.

  • భారీ నష్టాలు

ఖరీఫ్‌లో దఫధపాలుగా అకాల వర్షాలు, తుపాన్లు, వరదలు పంటలను నష్టపరిచాయి. డిసెంబర్‌లో వచ్చిన తుపానుకు పలు జిల్లాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ఆ తర్వాత కురిసిన అకాల వర్షాలకు సైతం పలు చోట్ల పంటలకు అపార నష్టం సంభవించింది. కాగా ప్రభుత్వం ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా చెల్లిస్తామనగా, 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసినా బీమా చెల్లింపు అడ్రస్‌ లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వం సొంతంగా బీమా అమలు చేయడంతో కొంచెం ఆలస్యమైనా, అందరికీ న్యాయం జరగకపోయినా, ఇ-క్రాప్‌ నమోదుల్లో అవకతవకల వలన అక్కడక్కడ అక్రమాలు జరిగినా, రైతులకు కొంత మేరకైనా ఇన్సూరెన్స్‌ సొమ్ము అందింది. ఇప్పుడు కేంద్ర పథకంలో చేరి, ప్రైవేటు కంపెనీలకు అమలు బాధ్యత అప్పగించడంతో క్లెయిముల్లో విపరీతమైన జాప్యం జరగడంతో పాటు పలు కొర్రీలు పడుతున్నాయని తెలుస్తోంది.