Dec 18,2020 21:04

ఏనుగుల దాడిలో ధ్వంసమైన డ్రిప్పు పైపులు


ప్రజాశక్తి - సోమల
ఆరుగాలం కష్టించి పండించిన పంటలపై ఏనుగుల గుంపు పంజా విసురుతోంది. దాదాపు 17 ఏనుగుల గుంపు ఆరు పంచాయతీలను వణికిస్తున్నాయి. సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లి, పెద్ద ఉప్పరపల్లి, ఆవులపల్లి, నంజంపేట, ఎన్‌.నడింపల్లి, సోమల పంచాయతీలు అటవీ సమీప ప్రాంతాలు కావడంతో ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అరటి, బొప్పాయి, మిరప, టమోట, వరి, సపోట, కొబ్బరిచెట్లను నాశనం చేస్తూ రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. వారం రోజులుగా దేవలకుప్పం, భయ్యారెడ్డిగారిపల్లి, వంగసానివారిపల్లి గ్రామాల సమీప పొలాల్లో సంచరిస్తూ శ్రీనివాసులు, సిద్దులప్ప, రఘునాథ, జనార్ధనరెడ్డి, మరో ముగ్గురు ముస్లీం రైతుల పొలాల్లోని వ్యవసాయ బోర్లను, డ్రిప్‌ పైపులను, అరటి, బొప్పాయి, సపోట, చెరకు పంటలను నాశనం చేశాయి. నంజంపేట పంచాయతీ సరస్వతిపురం సమీపంలో శుక్రవారం వేకువజామున 17 ఏనుగులు సంచరించి ఈశ్వరయ్య, జయమ్మ, దస్తగిరి, భాస్కర్‌నాయుడు తదితర రైతులకు చెందిన వరిపైరు, అరటి పంటలపై దాడిచేశాయి. మరో రైతుకు చెందిన 17 రాతికూసాలను ధ్వంసం చేశాయి. పొలాల వద్ద కుప్పలుగా పోసి ఉన్న వరి కుప్పలను చెల్లాచెదురు చేయడం, గోతాల్లో నింపి ఉన్న వరి ధాన్యాన్ని రోడ్లపైకి తీసుకొచ్చి చెల్లాచెదురు చేశాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమేసేందుకు బాణసంచా పేల్చి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఏనుగుల సంచారంపై సోమల బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులును వివరణ కోరగా తమిళనాడు ప్రాంతం నుంచి పలమనేరు మీదుగా పెద్ద ఉప్పరపల్లి, ఆవులపల్లి అటవీ ప్రాంతాల మార్గం నుంచి సరస్వతీపురం ప్రాంతానికి వచ్చాయని, ఏనుగుల గుంపును తరిమేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో దండోరా వేయించి రైతులను, ప్రజలను హెచ్చరిస్తున్నామని, రైతులు ఎవరూ ఒంటరిగా రాత్రివేళల్లో పొలాల వద్దకు వెళ్లరాదని సూచిస్తున్నామన్నారు.