Nov 05,2020 20:22

చూపుతున్న దృశ్యం


ప్రజాశక్తి - వి.కోట : ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్నకు అవస్థలు తప్పేలా లేదు.ఏదో ఒక రూపంలో విపత్తు వెంటాడుతూనే ఉంది. నాడు కత్తెర పురుగు. నేడు నత్తలు అన్నదాత కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మాటువేసి రాత్రిపూట కాటువేస్తున్నాయి. తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. .పంట రక్షణకు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది వ్యవసాయ అనుబంధ రంగాల నిర్లక్ష్యం అన్నదాతకు శాపంగా మారింది.
నత్త ఆ పేరు వింటేనే అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. మొలక దశలో పైరుపై తీవ్రంగా దాడి చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఉద్యాన పంటలు విస్తారంగా సాగుచేస్తారు. టమోటా, బీన్స్‌, క్యాబేజీ, సొర, బీర, కాకర, మిరప, బంతి తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ సీజన్లో వర్షాలు అధికంగా కురిశాయి. భూగర్భ జలమట్టం పెరిగింది.రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు.మండల పరిధిలో 22 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. సుమారు 1500 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు.ఆధునిక విధానాల్లో అధిక పెట్టుబడులు పెట్టి పంట సాగుకు రైతులు పూనుకుంటున్నారు. అయితే అన్నదాతల ఆశలను నత్తలు ఆవిరి చేస్తున్నాయి. విత్తు విత్తి మొలక భూమి నుంచి బయటకు వచ్చిన అనంతరం వీటిపై దాడి చేస్తున్నాయి. రాత్రి సమయంలో పంటలపై విరుచుకుపడుతున్నాయి. మాటు వేసి పైరుని నేలకూలుతున్నాయి. నత్తల నియంత్రణకు అన్నదాతల అవస్థలు పడుతున్నారు. వాటి నియంత్రణకు సరైన మందు తెలియక పంటను రక్షించుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఈ క్రమంలో కరిపల్లి గ్రామానికి చెందిన చెంగరాజు ఒక ఎకరం పొలంలో పెన్సిల్‌ బీన్స్‌ విత్తారు. కిలో 1200 చొప్పున ఆరు కిలోలు కొనుగోలు చేశారు. ఇందుకు గాను 7200 రూపాయలు ఖర్చుచేశారు. విత్తి 15 రోజులు గడిచింది. పైరు రెండాకుల దశకు చేరింది. కాండంపై రాత్రి పూట నత్తలు దాడి చేసి నాశనం చేస్తున్నాయని రైతు వాపోయారు..పంట సస్యరక్షణ ఉత్పాదకాలు స్థానిక దుకాణాల్లో అందుబాటులో లేదని పేర్కొన్నారు. కర్నాటక రాష్ట్రం బేత్మంగళం, కోలారు తదితర ప్రాంతాల్లో వెతికినా మందులు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు.