రాష్ట్రస్థాయిలో క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు : విశాఖ, విజయవాడ, మంగళగిరిలో క్రీడా అకాడమీలు : సిఎస్ జవహర్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం 2023-28 రాష్ట్ర క్రీడా విధానంపై క్రీడాశాఖాధికారు లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, అది మంజూరైతే రాష్ట్రానికి క్రీడా పరంగా దేశంలోనే మరింత గుర్తింపు వస్తుందన్నారు. విశాఖ, విజయవాడ, మంగళగిరిలో మూడు క్రీడా అకాడమీలను ఏర్పాటు చేసేందుకు నూతన క్రీడా విధానంలో పొందుపరచాలన్నారు. జిల్లాల్లో 16 క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ పేర్కొన్నారు. ప్రతి క్రీడా పాఠశాలలో 100 మంది బాలురు, 120 మంది బాలికలకు 16 విభాగాలకు సంబంధించిన వివిధ క్రీడల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఎస్ సూచించారు. వీటి ఏర్పాటుకు భూమి, నిధులు, ఇతర అవసరాలు కావాలనే దానిపై పూర్తి స్థాయిలో అంచనా వేసి నివేదిక సిద్ధం చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో క్రీడాపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. 'ఆడుదాం ఆంధ్ర' పేరిట క్రీడా పోటీలకు సంబంధించి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయి కార్యాచరణతో సిద్ధం కావాలన్నారు. తొలుత రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ 2023-28 రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించి ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎమ్‌డి హర్షవర్ధన్, ఎఒ రామకృష్ణ పాల్గొన్నారు.










