లండన్: యాషెస్ సిరీస్‌లో వెనుకబడ్డ ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైస్ కెప్టెన్ ఓలీ పోప్ గాయం కారణంగా యాషెస్ సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. అతడి కుడి భుజానికి గాయం కావడమే ఇందుకు ప్రధాన కారణమని ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఓలీ పోప్ త్వరలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని, అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోలేదని ఇసిబి ఆ ప్రకటనలో పేర్కొంది. ఓలీ పోప్ తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 31, రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే ఔటయ్యాడు. యాషెస్ సిరీస్ మూడోటెస్ట్ జులై 06నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది.










