Oct 27,2022 21:36

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్‌లోని ఉద్యోగులు ఆ కంపెనీకి కాబోయే అధినేత ఎలన్‌ మస్క్‌కు ఝలక్‌ ఇస్తున్నారు. మస్క్‌ చేతికి ట్విట్టర్‌ రాగానే 75 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నారనే రిపోర్టులతో పలువురు రాజీనామా చేసి.. ఇతర దిగ్గజ కంపెనీల్లో చేరుతున్నారని డేటా విశ్లేషణ, పరిశోధన సంస్థ పంక్స్‌ అండ్‌ పిన్‌స్ట్రిప్స్‌ ఓ రిపోర్టులో తెలిపింది. దాదాపు ఒప్పందం తుది స్థాయికి చేరిన ఈ నెలలో 50 మంది ఉద్యోగులు రాజీనామా చేశారని పేర్కొంది. ఈ ఒప్పందం జరిగిన తర్వాత కొన్ని నెలలుగా వందలాది మంది కంపెనీని విడిచిపెట్టారని తెలిపింది. ఈ సంస్థలో మొత్తం 7,500 మంది ఉద్యోగులు ఉండగా.. జనవరి నుండి ఇప్పటి వరకు 1,100 మందికి పైగా కంపెనీని వదిలేశారని తెలిపింది. గత మూడు నెలల్లో దాదాపు 530 మంది ఉద్యోగాలనుంచి వైదొలిగారని పేర్కొంది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీని వీడిన వారితో పోలిస్తే ఇది 60 శాతం అధికమని వెల్లడించింది. ఇందులో 30 శాతం మంది గూగుల్‌, మెటా వంటి ఇతర టెక్‌ దిగ్గజ కంపెనీల్లో చేరారని పంక్స్‌ అండ్‌ పిన్‌స్ట్రిప్స్‌ తెలిపింది. మిగితా వారు టిక్‌టాక్‌, లింక్డిన్‌, పింటెరెస్ట్‌ తదితర కంపెనీల్లోకి వెళ్లారని పేర్కొంది.

తొలగింపులుండవు : మస్క్‌
ట్విట్టర్‌ తమ స్వాధీనంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులను తొలగించబోమని ఎలన్‌ మస్క్‌ హామీ ఇచ్చారు. ఆ సంస్థ స్వాధీనానికి బుధవారం శాన్‌ప్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ కార్యాలయానికి వచ్చిన మస్క్‌ ఉద్యోగులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు చేసింది. ఆ సంస్థలో 75 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నారనే రిపోర్టుల నేపథ్యంలో మస్క్‌ స్పందించారు.