- ఎటుచూసిన బురద, చెత్తా చెదారం
- కాటన్ బ్యారేజీ, భద్రాచలం వద్ద కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : అడుగు తీసి అడుగువేయలేనంత బురద.. ఏ రహదారి చూసిన బురదమయమే.. వరదకు కొట్టుకొచ్చిన దుంగలు.. కరెంటు తీగలపై బట్టలు..సగం కూలిపోయిన ఇళ్లు..ఏ ఒక్కరిని కదిలించిన కన్నీటి కష్టాలే.. గోదావరి శాంతించడంతో బయటపడుతున్న లంకలోని పరిస్థితి ఇది. ఇళ్లల్లోకి చేరిన మట్టిని తొలగించుకునే పనిలో బాధితులు నిమగమయ్యారు. పూర్తిగా బురదమయమైన వస్తువులను ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకుంటున్నారు. ఏ వస్తువు కింద ఏ పాము దాగి ఉందోనని భయం భయంగా శుభ్రం చేస్తున్నారు. కాకినాడ జిల్లా నుంచి వచ్చిన శానిటేషన్ సిబ్బంది వీధుల్లోని బురదను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఆలమూరు మండలం బడుగువాని లంక, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, పి.గన్నవరం మండలం లంకల గన్నవరం, రాజోలు మండలం రాజోలు లంకలో ఇళ్లకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ప్రాంతాల్లో సుమారు 120 ఇళ్ల వరకూ నష్టం వాటిల్లినట్టు అంచనా.
పరిహారం రూ.50 వేలు ఇవ్వాలి
'వరదలకు నా ఇల్లు పూర్తిగా మునిగిపొయింది. ఇంటి నిండా చెత్తా చెదారం పేరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.50వేలు పరిహారమివ్వాలి'అని ఐ.పోలవరం మండలానికి చెందిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 'వరదలు రావడంతో కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నాం. ముంపు తగ్గడంతో ఇంటి కొచ్చి చూస్తే ఇంటి నిండా మట్టి పేరుకుపోయింది. మరమ్మ తులు, పాడైన సామగ్రిని కొనుక్కునేందుకు ప్రభుత్వం పరి హారం ఇవ్వాలని మరో బాధితుడు డిమాండ్ చేశారు. జిల్లా లోని ఇంకా 23 లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.
24 గంటల్లో సాధారణ స్థితికి గోదావరి
భద్రాచలం వద్ద 46 అడుగులు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 14.2 అడుగల నీటిమట్టం గురువారం నమోదైంది. ఈ రెండు చోట్లా రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. బ్యారేజీకి చెందిన 175 గేట్ల ద్వారా 13.39 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పోలవరం అప్పర్ స్పిల్‌వే వద్ద 33.44, డౌన్ స్పిల్ వే వద్ద 25.13 మీటర్ల నీటి మట్టం నమోదైంది. మరో 24 గంటల్లో నీటి ప్రవాహం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.










