Jun 21,2022 07:43
  • వాయిదాలు పడుతున్న ప్రాజెక్టు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అనుకున్న లక్ష్యానికి విద్యుత్‌ బస్సు రోడ్డెక్కలేదు. ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాలుష్య నియంత్రణ కోసం ఎపిఎస్‌ ఆర్‌టిసి చేపట్టిన విద్యుత్‌ బస్సుల ప్రాజెక్టు వాయిదాలపై వాయిదా పడుతోంది. ఏప్రిల్‌ నాటికి రావాల్సిన మొదటి విద్యుత్‌ బస్సు జూన్‌ పూర్తవుతున్నా రాని పరిస్థితి నెలకొంది. ఆర్‌టిసిలోని పాత బస్సులకు బ్యాటరీలు అమర్చి నడపడం, ఎసి సౌకర్యంతో పిపిపి పద్ధతిలో కొత్త విద్యుత్‌ బస్సులను తీసుకోవడం వంటి ప్రాజెక్టులు సాకారం కావడం లేదు. పాతబస్సులకు బ్యాటరీ అమర్చే ప్రాజెక్టు ప్రయోగా త్మకంగా విజయవంతమైనా.. నిధులు కేటాయింపులు లేకపోవడంతో పేపర్లకే పరిమితమైంది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నంలలో నడిపేందుకు 350 విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టాలని గతేడాదిలో అధికారులు నిర్ణయించారు. పిపిపి పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థలే బస్సుల సరఫరా, నిర్వహణ చేయాలి. హైర్‌బస్సుల పద్ధతిలో ఆర్‌టిసి చెల్లింపులు చేస్తోంది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. తిరుపతి కేంద్రంగా 100 బస్సులను నడిపేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. తిరుపతి కేంద్రంగా చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో విద్యుత్‌ బస్సులు నడిపేందుకు ఒప్పందాలు ఖరారయ్యాయి. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి, అలిపిరి, మదనపల్లి, కడప కేంద్రాల్లో విద్యుత్‌ బస్సుల ఛార్జింగ్‌ పాయింట్ల కోసం హెచ్‌టి లైన్‌ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అగ్రిమెంటులో భాగంగా ఏప్రిల్‌లో మొదటి విద్యుత్‌ బస్సును అందించి.. ఈ ఏడాది నవంబరులోపు 100 విద్యుత్‌ బస్సులను అందించాల్సి ఉంది. ఒప్పందం జరిగి ఏడు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు.
 

                                                          నిధులు లేక ప్రాజెక్టు ఆలస్యం

ఇప్పుడున్న ఎపిఎస్‌ ఆర్‌టిసి పాత బస్సులకు బ్యాటరీలు అమర్చి విద్యుత్‌ బస్సులుగా నడిపే ప్రాజెక్టును బెంగళూరుకు చెందిన వీరవాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెట్‌ సాంకేతిక సహకారం అందించింది. ఈ నేపథ్యంలో దాదాపు 100 పాత బస్సులను ఈ ఏడాది బ్యాటరీ బస్సులుగా మార్చేందుకు ఎపిఎస్‌ ఆర్‌టిసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా డీజిల్‌ ఇంజిన్‌ స్థానంలో ప్రవేశపెట్టిన బ్యాటరీతో తయారుచేసిన ఒక బస్సు తిరుపతి-తిరుమల మధ్య, బెంగళూరులోని నందిహిల్స్‌లో చేపట్టిన ట్రయల్‌రన్‌ విజయవంతమైంది. 2020లోనే ట్రయల్‌రన్‌ పూర్తయినా.. కేవలం నిధుల కేటాయింపులు లేక ఈ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు.