ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పరిపాలనకు సంబంధించి ఏర్పాటు చేసిన కోర్ డాష్‌బోర్డ్ దాదాపుగా అంతర్ధానమైపోతోంది. పథకాలకు, పాలనకు సంబంధించిన వివరాలను అందించేందుకు ఉపయోగించే ఈ సైట్‌ను ఇటీవల కాలంలో వినియోగించడం మానుకుంటున్నారు. గత ఏడాది ప్రభుత్వ ఉత్తర్వులను ప్రకటించే జిఓఐఆర్ (గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్)ను మూసివేసినట్టే, నేడు కోర్ డాష్‌బోర్డును కూడా చేస్తున్నారు. ఒకటీ అరా శాఖలు తప్ప ఈ సైట్‌ను పెద్దగా ఉపయోగించడం లేదు. తమకు వచ్చిన అనధికారిక ఆదేశాల మేరకే ఈ సైట్‌లో వివరాలు అప్డేట్ చేయడం లేదని కొంతమంది అధికారులు చెబుతున్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 2014 ఆగస్టులో ఈ సైట్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ప్రతి శాఖకు ఒక్కో లింక్‌ను కేటాయించారు. అన్ని శాఖలకు సంబంధించిన వివరాలు ప్రతి రోజూ ఈ సైట్‌లో రికార్డు చేసేవారు. దీనివల్ల సాధారణ ప్రజలకు కూడా ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకునే వెసులుబాటు కలిగేది. అత్యంత కీలకమైన ఆర్థికశాఖకు సంబంధించిన వివరాలు కూడా ఈ సైట్‌లో ఉండేవి. అయితే 2019లో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిపై ఆసక్తి చూపించడం మానేసారు. రెండేళ్లుగా అయితే కొన్ని శాఖలు ఈ సైట్‌ను వినియోగించడం పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. అనేక శాఖల్లో 'లాస్ట్ అప్‌డేట్' అన్నది 2020లో మాత్రమే చూపిస్తోంది. ఇంకొన్ని శాఖలు వారానికో, పది రోజులకో ఒకసారి సైట్ తెరుస్తున్నట్లు సమాచారం. అది కూడా కొత్త సమాచారాన్ని అప్‌డేట్ చేయకుండానే వెనుకకు వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆర్థికశాఖ సైట్‌ను మూడేళ్ల క్రితమే నిలిపివేయగా, వ్యవసాయం, ఎక్సయిజ్ వంటివి కొంతవరకు పనిచేస్తున్నాయి. మిగిలిన శాఖల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక మరో కీలకమైన ఆర్‌టిజిఎస్‌ది (రియల్‌టైమ్ గవర్నెన్స్ సిస్టమ్) ఇదే స్థితి. తమకు గతంతో పోలిస్తే పని భారం తక్కువైందని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు.










