Sep 19,2023 15:31
  •  దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు

ప్రజాశక్తి-విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలక మండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు. విజయవాడలో దుర్గగుడిలో మంగళవారం చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈఓ భ్రమరాంబ శరన్నవరాత్రి మహౌత్సవాల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రి పై అక్టోబర్‌ 15 నుంచి 23 తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహౌత్సవాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 15న ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారని తెలిపారు. అనంతరం 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19న శ్రీ మహాచండీ దేవి అలంకారం, 20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)లో అమ్మవారు దర్శనం ఇస్తారని తెలిపారు. అక్టోబర్‌ 20న మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని కర్నాటి రాంబాబు తెలిపారు. అక్టోబర్‌ 21 న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం, 22న శ్రీ దుర్గాదేవి అలంకారం, 23న శ్రీ మహిషాసురమర్ధనీ దేవిఅలంకారం... మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నట్లు దుర్గగుడి పాలక మండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు. ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.. వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయని చెప్పుకొచ్చారు. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారని...భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. జల్లు స్నానాలకు షవర్‌ లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయన్నారు. మోడల్‌ గెస్ట్‌ హౌస్‌, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తాం అని తెలిపారు.

2