- బురదతో నిండిన గడ్డి - ప్రభుత్వ దాణా ఐదు రోజులకే
- లంక గ్రామాల్లో పశువుల దయనీయ స్థితి
ప్రజాశక్తి - భీమవరం : పాడి పశువుల గొంతు మూగబోయింది.. దాణా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. లంకగ్రామాల్లో పశువుల పరిస్థితి దయనీయంగా మారింది. వరదలకు గడ్డిమేట్లు కొట్టుకుపోవడం, పచ్చగడ్డి కుళ్లిపోవడంతో పాడి పశువుల కడుపు నింపలేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం అరకొరగా దాణా పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. దీంతో పాల దిగుబడి దాదాపు ఆగిపోయింది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, నరసాపురం, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు ముఖ్యంగా పాడి పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ మూడు మండలాల్లో సుమారు 8,791 పశువులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 3,047 మంది పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. వరద తాకిడికి పాడి రైతులు భద్రపరుచుకున్న ఎండుగడ్డి కొట్టుకుపోయింది. పచ్చగడ్డి మడులు నీట మునిగాయి. రోజుల తరబడి నీటిలో ఉండిపోవడంతో పచ్చగడ్డి కుళ్లిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసిన సంపూర్ణ సమీకృత దాణా అరకొరగానే అందింది. ఈ దాణా తినేందుకు పశువులు విముఖత చూపుతున్నాయని రైతులు చెబుతున్నారు. పాడి పశువులకు దాణా లేకపోవడంతో పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. 'గతంలో ఐదారు లీటర్ల పాలిచ్చే గేదెలు వారం రోజుల క్రితం వరకూ ఒకటి, రెండు లీటర్లకు మించి పాలు ఇవ్వలేదని, ప్రస్తుతం చుక్క పాలుకూడా ఇవ్వడం లేదని' ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల పాకలు నేలమట్టమవ్వడంతో ఎత్తయిన ప్రదేశాల్లో, ఏటిగట్లపై, రోడ్ల వెంబడి పశువులను ఉంచి రక్షించుకుటుంన్నారు.
అరకొరగా దాణా సరఫరా
ఒక పశువుకు రోజుకు ఐదు కిలోల చొప్పున ఐదు రోజులకు 25 కిలోల దాణాను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 8098 పాడి పశువులకు 300 టన్నుల దాణాను ప్రభుత్వం అందించింది. వరదలు వచ్చి 20 రోజులు గడుస్తున్నాయి. ఐదు రోజులకు సరిపడా దాణానే ప్రభుత్వం అందించింది. లంక గ్రామాల్లో అటు ఎండుగడ్డి, ఇటు పచ్చగడ్డి లేకపోవడం, ప్రభుత్వం అందించిన దాణా సరిపోక మూగజీవాలు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంతంగా 330 కాపుల ఎండుగడ్డిని రైతులకు అందించారు.











