Apr 10,2023 21:14

ముంబయి: ఈ ఏడాది నుంచి దులీప్‌, దేవధర్‌ టోర్నమెంట్‌లను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా నిలిచిపోయిన దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌లను 2023-24 సీజన్‌ నుంచి ప్రారంభించనున్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. దులీప్‌ ట్రోఫీని జూన్‌ 28 - జులై 16వరకు, జులై 24నుంచి ఆగస్టు 3వరకు దేవధర్‌ టోర్నమెంట్‌లు నిర్వహించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. అలాగే ఈ రెండు టోర్నమెంట్‌లు తమిళనాడు, బెంగళూరు వేదికల్లో జరగనున్నాయి. అలాగే ఇరానీ కప్‌ అక్టోబర్‌ 1-5న సౌరాష్ట్ర వేదికగా.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ అక్టోబర్‌ 16 - నవంబర్‌ 6న, విజరు హజారే టోర్నీ నవంబర్‌ 23నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక రంజీట్రోఫీని వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మార్చి 14వరకు నిర్వహించేందుకు బిసిసిఐ దేశవాళీ షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు ఆ అధికారి చెప్పుకొచ్చారు. చివరిసారిగా ఈ రెండు దేశవాళీ టోర్నమెంట్‌లో 2019 ఏడాదిలో జరిగాయి.
తాత్కాలిక షెడ్యూల్‌..
దులీప్‌ ట్రోఫీ : జూన్‌ 28 - జులై 16
దేవధర్‌ ట్రోఫీ : జులై 24 - ఆగస్టు 3
ఇరానీ కప్‌ : అక్టోబర్‌ 1 - 5
సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ : అక్టోబర్‌ 16 - నవంబర్‌ 6
విజరు హజారీ ట్రోఫీ : నవంబర్‌ 23 - డిసెంబర్‌ 15
రంజీ ట్రోఫీ : జనవరి 5, 2024 - మార్చి 14