Jun 07,2023 09:35
  • విచ్చలవిడిగా లైంగిక, హింసాత్మక దాడులు
  • ఖండించిన ఐద్వా : సమగ్ర దర్యాప్తునకు డిమాండ్‌

అగర్తలా : త్రిపురలో బిజెపి హయాంలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా వుంది. చిన్నారులు, యువతులు, గిరిజన మహిళలు, వికలాంగులు ఇలా వారు వీరు అనే తేడా లేకుండా మహిళ లను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక దాడులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మే 14వ తేదీన గోమతి, లాల్చారా జిల్లాలో ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారాలు జరిగాయి, మే 24న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, 28న 11 ఏళ్ల బాలికపై మరో దాడి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి. జూన్‌ 1వ తేదీనే ఇలాంటివి మరో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి ఈ ఘాతుకానికి బలైతే, 14 ఏళ్ల బాలికపై భయానకరీతిలో సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. ఆ మరుసటి రోజు 2వ తేదీన ఐటిఐ విద్యార్థిని, 14 ఏళ్ల బాలికను అపహ రించారు. గతేడాది అక్టోబరులో రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి, హోం మంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న డాక్టర్‌ మాణిక్‌ సాహా సమర్పించిన ఒక నివేదికలో ఆందోళ నక రీతిలో గణాంకాలు వెల్లడయ్యాయి. 2020 జనవరి నుండి రాష్ట్రంలో 400కి పైగా అత్యాచార సంఘటనలు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 1174 మందిని అరెస్టు చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో లైంగిక దాడులకు గురైన తర్వాత ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారని కూడా ఆ నివేదిక తెలిపింది. సిపిఎం ఎంఎల్‌ఎ నిర్మల్‌ బిశ్వాస్‌, కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ సుదీప్‌ రారు బర్మన్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలు అందజేసింది.
 

                                                                               ఐద్వా ఖండన

త్రిపురలో మహిళలపై లైంగిక, ఇతర రకాలైన హింస పెరిగిపోవడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15, జూన్‌ 1 మధ్య జరిగిన ఇటువంటి 12 కేసుల వివరాలను ఐద్వా త్రిపుర రాష్ట్ర కమిటీ నమోదు చేసింది. ఈ మేరకు ఆ వివరాలను వెల్లడిస్తూ ఐద్వా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 15న 12ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిగిందని, ఒక వారం గడిచిన తర్వాత ఏప్రిల్‌ 23న కొంతమంది బిజెపి గూండాలు, పంచాయత్‌ ప్రధాన్‌ కలిసి అత్యాచారానికి ఒడిగట్టారని ఐద్వా తెలిపింది. మే 2వ తేదీన మానసిక వైకల్యంతో బాధపడే మహిళపై ఇటువంటి దురాగతానికి పాల్పడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని ఐద్వా పేర్కొంది. ఈ కేసులపై దర్యాప్తుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేసి, దోషులపై తీసుకున్న చర్యల నివేదికను విడుదల చేయాలని త్రిపుర మహిళా కమిషన్‌ను ఐద్వా కోరింది. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, మహిళల భద్రతకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్‌ చేసింది.