Aug 22,2022 08:48
  • కలెక్టర్లకు అధికారాలిచ్చినా కదలని ఫైళ్లు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చుక్కల భూముల(డాటెడ్‌ ల్యాండ్స్‌)ను 22 (ఎ) నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని అన్నదాతలు దశాబ్దాలుగా చేస్తున్న విన్నపాలకు నేటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకలేదు. అన్నదాతలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ, ఆయా దరకాస్తులను తిరస్కరించడమో, పెండింగ్‌లో పెట్టడమో చేస్తున్నారు. పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించేందుకు అధీకృత వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణంగా ప్రభుత్వం గుర్తించింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అధికంగా చుక్కల భూములు ఉన్నట్లు దరకాస్తులను బట్టి అర్థమవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఇటీవల బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫైళ్ల పరిష్కారానికి నోచుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన నాటికి సుమారు లక్ష వరకూ దరకాస్తులు పెండింగ్‌లో ఉండగా, మూడు వేల వరకూ క్లియర్‌ అయినట్లు సమాచారం. నేటికీ 90వేలకుపైగా దరకాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని దరకాస్తులు తిరస్కరణకు గురికాగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతున్న నేపథ్యంలో చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆయా భూములకు సంబంధించిన శాశ్వతంగా చుక్కలు తొలగించే అవకాశాలు సన్నగిల్లుతాయనే భావన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. నిషేధిత భూముల జాబితా 22(ఎ) నుంచి అర్హులైన వారిని తొలగించి ఆయా భూములు రిజిస్టర్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. ప్రతి సోమవారం రెవెన్యూ కార్యాలయాల్లో జరిగే స్పందనలో చుక్కల భూములకు సంబంధించిన అర్జీలు ఎన్నో కొన్ని అధికారులకు అందుతూనే ఉన్నాయి. వందేళ్లకు ముందు బ్రిటీష్‌ ప్రభుత్వ హయాంలో భూముల సర్వే జరగ్గా మరలా ఇప్పుడు మాత్రమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే జరుగుతోంది. రీ సర్వేలో గుర్తించిన భూములకు మాత్రమే కొత్తగా నమోదు చేసే రికార్డుల్లో ఆయా భూముల యాజమానులు, విస్తీర్ణం నమోదు చేస్తారు. అటువంటి భూములకు ప్రభుత్వం భూ యాజమాన్యహక్కు కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చుక్కల భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్లు విచారణ త్వరగా చేపట్టి తమ భూములను 22(ఎ) నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చుక్కల భూముల సమస్య పరిష్కారం కాకపోవడంతో విలువైన భూములున్నప్పటికీ తమ పిల్లల వివాహాలు, ఉన్నత చదువులు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని అమ్ముకునే అవకాశం లేక పోవడంతో వడ్డీ వ్యాపారులను ఆ శ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.