Oct 03,2023 16:31

కృష్ణాజిల్లా: సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. మచిలీపట్నంలో జనసేనాని మాట్లాడారు. ''జగన్‌ క్లాస్‌ వార్‌ అని ఇంకోసారి మాట్లాడకు. జగన్‌ తరచూ క్లాస్‌ వార్‌ అని చెబుతారు. రాయలసీమ నుంచి మచిలీపట్నం వచ్చి సమస్యలు చెబుతున్నారు. అణగారిన వర్గానికి నాయకుడిగా చెప్పుకునే పెద్ద మనిషి. పేదలను దౌర్జన్యంగా ఖాళీ చేయించి వీధికి లాగారు. గతంలో వైఎస్‌ కూడా హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కోసం పేదల ఇళ్లు కూల్చేశారు. పేపర్లపై పట్టాలు చూపించి.. ఇళ్లను తొలగించడం దుర్మార్గం. క్లాస్‌ వార్‌ అని మాటలు చెబితే పని చేయదు జగన్‌. అణగారిన వర్గాలకు న్యాయం చేసే వరకు క్లాస్‌ వార్‌ అని చెప్పకు. నంద్యాలలో మీ వాళ్లు చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాలకు నిదర్శనం వీళ్ల దగ్గర ఉన్న ఫొటోలు. వెయ్యి మంది ఉన్న నివాసాలలో ప్రొక్లెయిన్లతో కూల్చేశారు. జనసేన శ్రేణులు అక్కడ అడ్డం పడితే.. చర్యలు ఆపారు. ఈ అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లండి. అన్యాయంగా ఇళ్లను కూలకొట్టిన వారిపై భవిష్యత్‌లో చర్యలు తీసుకుంటాం.'' అని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో విభిన్న ప్రతిభావంతులను కించపరిస్తే.. శిక్షించేలా చట్టం చేస్తాం. బధిరులను అపహాస్యం, అవహేళన చేసినా, కఠిన చర్యలు తీసుకునేలా దేశం మొత్తం అమలు చేయాలి. అదే విధంగా వీరి కోసం కూడా ఒక కార్యక్రమం జనసేన చేపడుతుంది. డాక్టర్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో కూడా అవసరమైన సాయం అందిస్తాం.'' అని పవన్‌ వెల్లడించారు.''సదరన్‌ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అర్హత ఉన్నా.. సర్టిఫికెట్‌లో జాప్యం ఎందుకు?, అధికారులు, పాలకులు వారి గోడు వినిపించుకోరా?, వారి సమస్యల పరిష్కారం కోసం జనసేన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది.'' నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.