- డిజిటల్ సిగేచర్ ఆలస్యం పట్ల సిసిఎల్‌ఎ చురకలు ?
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పాస్ పుస్తకాల్లో తప్పులు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని సిసిఎల్‌ఎ సాయి ప్రసాద్ అధికారులతో పేర్కొన్నారు. భూముల రీ-సర్వే అనంతరం భూయజమానులకు ఇచ్చే హక్కుల పత్రం (పట్టాదారు పాసు పుస్తకం)లో ఎటువంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిందిగా విజయవాడలో శుక్రవారం జరిగిన 9 జిల్లాల రెవెన్యూ రీజినల్ సదస్సులో సంబంధిత అధికారులకు ఆయన మార్గనిర్ధేశనం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రీ సర్వే జరిగిన గ్రామాలకు సంబంధించి డిజిటల్ సిగేచర్ అనేక జిల్లాల్లో పెండింగ్ ఉండటం పట్ల జాయింట్ కలెక్టర్లపై సిసిఎల్‌ఎ అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ సిగేచర్ పూర్తి కాక పోతే రీ సర్వే పూర్తయిన రెండు వేల గ్రామాలకు చెందిన హక్కుల పత్రాలు ప్రింటింగ్‌కు ఇవ్వడానికి అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్నట్లు 29 గ్రామాలకు చెందిన డిజిటల్ సిగేచర్ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారం 8 ని జారీ చేసేందుకు జనరేట్ చేసేందుకు ఒక్క రోజు సరిపోతుందని, నోటీసు ఇచ్చిన తర్వాత 15 రోజులు సమయం ఉంటుందని, అనంతరం ఎవరి పేరు రికార్డుల్లో ఎక్కుతోందో తెలుస్తుం దన్నారు. నెల నుంచి వత్తిడి తెస్తున్నప్పటికీ ఎందుకు ఫారమ్ జనరేట్ చేయడంలేదని ఆయన అధికారులను సూటిగా ప్రశ్నించారు.
ఆర్‌డిఓలకు పని ఏముంది ?
విఆర్‌ఓ, విలేజ్ సర్వేయర్లు తప్పులు చేస్తుంటే మీరు ఎందుకు సూపర్‌వైజింగ్ ఎందు కు చేయడం లేదని జాయింట్ కలెక్టర్లను కూడా సిసిఎల్‌ఎ ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్‌డిఓలు ప్రతి రోజు రివ్యూ చేయాలి? ఆర్‌డిఓలకు ప్రత్యేకంగా పని ఏముంది? ప్రతి రోజు విఆర్‌ఓ లతో ఎందుకు సమీక్ష చేయరని నిలదీసినట్లుగా సమాచారం. పెండింగ్ ఎక్కువగా ఉన్న విఆర్‌ఓ, విలేజ్ సర్వేయర్లను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి పనిచేయించండి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.










