- పాఠాలు ఎలా బోధించాలంటున్న టీచర్లు
- అందినట్టు బయోమెట్రిక్ తీసుకోవాలని సర్కారు ఒత్తిడి
- రంగంలోకి వలంటీర్లు
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : పాఠశాలలు పున:ప్రారంభమై సుమారు పది రోజులు గడుస్తున్నా.. నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందడం లేదు. పాఠ్యపుస్తకాల ప్రచురణలో సర్కారు వ్యాపార ధోరణి అవలంభించడంతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం 30 నుంచి 40 శాతం మాత్రమే పంపిణీ అయినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అరకొర పుస్తకాలతో విద్యార్థులకు పాఠాలు ఎలా బోధించాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అందరికీ పుస్తకాలు అందినట్లు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని సర్కారు ఒత్తిడి చేస్తోంది.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 3384 ప్రభుత్వ స్కూళ్లు, 800 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో 2,31,137మంది, ప్రైవేటు స్కూళ్లలో 80వేల మంది విద్యార్థులు చదువుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఒకటవ తరగతి నుంచి పదోవ తరగతి వరకు సుమారు 25 లక్షలకు పైగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం 14,31,141 పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. దత్తిరాజేరు, నెల్లిమర్ల, సీతానగరం మండలాల్లో కొన్ని స్కూళ్లకు తెలుగు, సైన్స్, ఇంగ్లీషు మాత్రమే ఇచ్చారు. మిగిలిన స్కూళ్లకు లెక్కలు, హిందీ, సోషల్ పుస్తకాలను సర్దుబాటు చేశారు. అరకొరగా వచ్చిన పుస్తకాలు ఎవరికి పంచాలో అర్థం కాక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు అందరికీ అందినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని మరోవైపు ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లో వలంటీర్లు రంగంలోకి దిగి నేరుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు.పుస్తకాలు లేకపోతే పాఠ్యాంశాలు ఎలా బోధిస్తామని, సంవత్సరాంతంలో ఫలితాలు తగ్గితే తమను వేధింపులకు గురిచేస్తారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ అవుతుండటంతో అక్కడికి వెళ్లి తీసుకునేందుకు రానుపోనూ రవాణా ఛార్జీలు స్కూల్ బడ్జెట్‌లో నుంచి భరించాల్సి వస్తోందని వాపోతు న్నారు. పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తయారు చేసుకున్న పుస్తకాలను అధిక ధరలకు విద్యార్థులకు విక్రయిస్తున్నారు.
వచ్చిన మేరకు పంపిణీ
వచ్చిన పుస్తకాలు తక్కువా? ఎక్కువా? అన్నది మాకు తెలీదు... వచ్చిన మేరకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. అయినా అన్ని పుస్తకాలు ఒకేసారి ఎలా వస్తాయి. ఒకొక్కలోడూ వస్తోంది. వచ్చిన మేరకు పంపిణీ చేస్తున్నాం.
- జయశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి, విజయనగరం










