- బురదతో నిండిన ఊళ్లలోకి అడుగు పెట్టలేని పరిస్థితి
- 18 రోజులు గడుస్తున్నా విలీన మండలాల్లో పునరావాస కేంద్రాల్లోనే
- ఇచ్చిన బియ్యం, సరుకులు అయిపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో వరద బాధితులు
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : పోలవరం నిర్వాసితులు, వరద బాధితులు అయిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాల ప్రజల బతుకులు నేటికీ దుర్భరంగా ఉన్నాయి. పునరావాస కేంద్రాలకు చేరి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఊళ్లలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకుల్లేక, చేసేందుకు పనిలేక పునరావాస కేంద్రాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామంలో 213 కుటుంబాలు జీవిస్తున్నాయి. వరద ఉధృతికి తొలుత ఖాళీ చేసిన గ్రామం ఇదే. జులై ఆరో తేదీ నుంచి ఊరు విడిచి కుటుంబాలన్నీ రావికుంట పునరావాస కాలనీకి చేరాయి. ఇప్పటికి మూడు వారాలు గడిచిపోయాయి. ఈ ఊళ్లో 90 శాతానికిపైగా తాటాకిళ్లే. వరదలకు ఇళ్లన్నీ కుప్పకూలిపోయాయి. ఒకటి, అర ఉన్న రేకుల షెడ్డు ఇళ్లు సైతం దెబ్బతిని మొండిగోడలతో మిగిలాయి. వరద తాకిడికి ఊరంతా బురదమయంగా మారింది. రోడ్లపై జానెడు ఎత్తున బురద పేరుకుపోయి ఊళ్లోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. దీంతో, గొమ్ముగూడెం గ్రామస్తులంతా ఇప్పటికీ పునరావాస కాలనీలోనే ఉన్నారు. ప్రభుత్వం వీరికి 25 కిలోల బియ్యం, నూనె ప్యాకెట్, కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, రూ.రెండు వేల నగదు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఒక్కో కుటుంబంలో నాలుగు నుంచి ఆరుగురు వరకూ కుటుంబసభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో సహా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇల్లు గడిచే పరిస్థితి లేదు. పొలాలన్నీ మునిగిపోయాయి. ఉపాధి అనేది లేకుండాపోయింది. పిల్లలతో ఇల్లు ఎలా గడపాలో తెలీక అంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
ఏ ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదు
ఈ గ్రామంలోని ఏ ఒక్కరికీ ఇప్పటి వరకూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదు. 250 ఎకరాల భూములకు పరిహారం కూడా ఇంకా అందాల్సి ఉందని గ్రామస్తులు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత ఈ గ్రామంలో 65పైగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇవ్వలేదు. సెప్టెంబర్ నెలాఖరుకు ఇస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇప్పటి వరకూ అనేకసార్లు ఇదే విధంగా హామీ ఇచ్చారని, ప్రభుత్వం రెండు నెలల్లో పరిహారం ఇస్తుందన్న నమ్మకం తమకు లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కట్టుబట్టలతో బయటకు వచ్చామని, సామాన్లన్నీ వరదలకు దెబ్బతిన్నాయని తెలిపారు. కోళ్లు వంటివి సైతం వరదలకు కొట్టుకుపోయాయని కన్నీటిపర్యంతమవుతున్నారు. తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు.
రాపాకగొమ్ము గ్రామస్తులదీ ఇదే పరిస్థితి !
వేలేరుపాడు మండలం రాపాకగొమ్ము, రుద్రమ్మకోట గ్రామాల్లో పరిస్థితీ ఇదే విధంగానే ఉంది. రాపాకగొమ్ము గ్రామంలో 600 ఇళ్లు వరకూ ఉండగా, 80 శాతం ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. మిగిలిన ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ గ్రామస్తులు కూడా రావికుంట పునరావాస కాలనీలో మూడు వారాలుగా ఉంటున్నారు. తమకు తాగునీరు సైతం సరిగా అందడం లేదని, నిత్యావసర సరుకులు అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. రుద్రమ్మకోట గ్రామానికి చెందిన 200 కుటుంబాలు ఇంకా కొండలు, గుట్టలపైనే ఉన్నారు. వీరి పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు.











