Apr 03,2023 09:34

       నాలుగు కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టులు ఎన్‌టిపిసి కుడిగి మొదటి దశ (244.56 మె.వా.), ఎన్‌టిఇసిఎల్‌ వల్లూరు (86.15 మె.వా.), ఎన్టీ పిఎల్‌ (ఎన్‌ఎల్‌సి తమిళనాడు) (121.33 మె.వా.), ఎన్‌ఎల్సి ఎన్‌ఎన్‌ఎపిఎస్‌ (52.70 మె.వా.) ల నుండి విద్యుత్‌ లభ్యతను 2022-23, 2023-24 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై కమిషన్‌, విద్యుత్‌ పంపిణీ కంపెనీలు పరస్పర విరుద్ధంగా భిన్న వైఖరులు తీసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల పిపిఎల మిగిలి ఉన్న గడువు 18 నుండి 24 సంవత్సరాల వరకు ఉంది. అయితే, ఆ పిపిఎలకు కమిషన్‌ ఆమోదం ఇవ్వనందున అవి అమలు కాజాలవని కమిషన్‌ పేర్కొంది. వాటి చార్జీలు న్యాయంగా లేకపోతే, ఆ విద్యుత్‌ కొనుగోలుకు అనుమతించటం వినియోగదారులకు ప్రయోజనకరం కాదు. అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీలను కూడా కలుపుకుంటే, ఈ నాలుగు స్టేషన్ల విద్యుత్‌ యూనిట్కు సగటున రూ.5కు పైగా అవుతుంది. ఈ కారణాల వల్ల, ఈ ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ కొనుగోలుకు కమిషన్‌ గత ఆర్థిక సంవత్సరంలో అనుమతి ఇవ్వలేదు. అయితే విద్యుత్‌ కొరత వల్ల, మార్కెట్లో చాలా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చినందున డిస్కాములు పైనాలుగు కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతిం చాలని కోరగా కమిషన్‌ అందుకు అనుమతించలేదు. దానిపై డిస్కాంలు అప్పిలేట్‌ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగులో ఉంది. అయినా, డిస్కాంలు కమిషన్‌ ఉత్తర్వును ఉల్లంఘించి ఆ నాలుగు ప్రాజెక్టుల నుండి కూడా గత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తును కొనుగోలు చేశాయి.
         మొత్తం 17 కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టులలో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ మిషన్‌ మొదటి దశకు సంబంధించిన ఒక యూనిట్‌ మినహా, మిగిలిన ప్రాజెక్టులకు డిస్కాంలు పిపిఎలను కమిషన్‌కు సమర్పించి అనుమతి పొందటం లేదు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ ఏటేటా వార్షిక చార్జీల ఉత్తర్వులలో కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతులు ఇస్తూ వస్తున్నది. కమిషన్‌ ఆదేశించినా, డిస్కాంలు పిపిఎలను ఆమోదం కోసం సమర్పించకుండా దాటవేస్తున్నా, కమిషన్‌ సముచిత చర్య ఎందుకు తీసుకోవటం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఒకరకంగా ఇది నియంత్రణ ప్రక్రియను పక్కన పెట్టటమే. ఎందుకోసం, ఎన్నేళ్ళ పాటు కమిషన్‌ డిస్కాంల ఈ దాటవేత వైఖరి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటుంది? ప్రైవేటు విద్యుత్‌ ప్రాజెక్టులతో చేసుకున్న పిపిఎలను సమర్పించి, కమిషన్‌ ఆమోదం పొందుతున్న డిస్కాంలు ప్రభుత్వరంగ ప్రాజెక్టులతో చేసుకున్న పిపిఎల విషయంలో అలా ఎందుకు చేయటం లేదు? డిస్కాంలు సకాలంలో నియంతణ ప్రక్రియను పాటించేటట్లు కమిషన్‌ తన అధికారాన్ని వినియోగించి ఎందుకు నిక్కచ్చిగా వ్యవహరించటం లేదు? అవసరం లేని విద్యుత్‌ను ప్రైవేటు ప్రాజెక్టుల నుండి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం డిస్కాంలు వాటి పిపిఎలకు ప్రాధాన్యతనిచ్చి కమిషన్‌ ఆమోదం పొందుతున్నాయి. ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు అమలులో ఉన్నా, ముందు వాటి పిపిఎలకు అనుమతి పొందితే, ప్రైవేటు ప్రాజెక్టుల పిపిఎలకు అనుమతి పొందేందుకు వాటి నుండి విద్యుత్‌ కొనుగోలు అవసరాన్ని సమర్థించుకొనటం ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వ రంగ విద్యుత్‌ ప్రాజెక్టులు డిస్కాంల కోసమే విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా చేయడానికి ఉద్దేశించినవి గనుక వాటి పిపిఎలకు ఎప్పుడైనా ఆమోదం పొందవచ్చుననే ఎత్తుగడలను గతం నుండి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ప్రాజెక్టులను అమలు చేసే ప్రక్రియను ప్రారంభించినపుడే డిస్కాములు పిపిఎలను చేసుకుని కమిషన్‌ ఆమోదం పొందే విధంగా రెగ్యులేషన్‌ చేసి, అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా సూచిస్తున్నా, కమిషన్లు పెడచెవిన పెడుతూ వస్తున్నాయి. కేంద్ర విద్యుత్‌ స్టేషన్ల నుండి కొత్తగా విద్యుత్‌ కొనుగోలుకు పిపిఎలు చేసుకునే ప్రతిపాదనలను ఇప్పటి నుంచి కమిషన్‌ ఆమోదం కోసం సమర్పిస్తామని డిస్కాంలు 20 23-24 సంవత్సరానికి సమర్పించిన ఎఆర్‌ఆర్‌ ప్రతిపాదనలలో నివేదించాయి. ఇదే వైఖరి ప్రైవేటు విద్యుత్‌ ప్రాజెక్టుల విషయంలో కూడా అనుసరించాలి.
          పై నాలుగు కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టులను పరిగణించకుండానే, 2023-24లో 9982 మె.వా. కాంట్రాక్టు చేసిన ధర్మల్‌ ప్రాజెక్టుల స్థాపక సామర్ధ్యంతో 80 శాతం పిఎల్‌ఎఫ్తోనే 8000 మె.వా. బేస్‌ సామర్ధ్యం (రోజంతా ఉత్పత్తి చేసే సామర్ధ్యం) అవసరాన్ని 2000 మె.వా.
సౌర, 2500 మె.వా. పవన, 500 మె.వా. జల విద్యుత్తో తీర్చవచ్చునని కమిషన్‌ పేర్కొంది. రోజంతా విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రభుత్వ ర ంగ ధర్మల్‌ ప్రాజెక్టులున్నప్పటికి, విపరీతంగా మిగులు విద్యుత్‌ తేలే విధంగా ప్రైవేటు సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నుండి అవసరం లే ని విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వాల ఆదేశం మేరకు డిస్కాంలు చేసుకున్న దీర్ఘకాలిక పిపిఎలకు కమిషన్లు విచక్షణా రహితంగా అనుమ తులనిస్తూ వచ్చాయి. నష్టదాయకమైన, సమర్ధనీయం కాని భారీ మిగులు విద్యుత్‌ ఒక పక్క, అదే సమయంలో పీక్‌ డిమాండును తీర్చేంద కు మార్కెట్లో విద్యుత్‌ కొనాల్సిన పరిస్థితిలో, విద్యుత్‌ లభ్యతను గణనీయంగా తక్కువగా చూపే ప్రయత్నం కమిషన్‌ చేసింది. ప్రభుత్వాల అసమంజస నిర్ణయాల ప్రకారం డిస్కాంలు చేసుకున్న అవసరం లేని పిపిఎలకు అనుమతులను తిరస్కరించని నియంత్రణా వైఫల్యం ఈ పరిస్థితికి దారితీస్తున్నది.
         2022-23 ప్రధమార్ధంలో లో విదేశీ బొగ్గును వాడటం వల్ల పై నాలుగు కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టుల చార్జీలు యూనిటు సగటున రూ.6 .47 అనే కారణంతో ఆ విద్యుత్‌ కొనుగోలుకు డిస్కాంలను అనుమతించని కమిషన్‌ మార్కెట్లో యూనిట్కు రూ.10.5 వరకు కూడా చెల్లి ంచి కొనటానికి అనుమతి ఇచ్చింది. ఆ నాలుగు ప్రాజెక్టుల నుండి 2022-23లో తాము కొనుగోలు చేసిన విద్యుత్కు అనుమతి ఇవ్వాల న్న డిస్కాంల విజ్ఞప్తిపై ఆ సంవత్సర ఎఫ్పిపిసిఎ (ట్రూ అప్‌) క్లెయిములను పరిగణించేటపుడు ''సముచిత చర్య'' తీసుకొంటామని కమి షన్‌ పేర్కొంది.
         పై నాలుగు కేంద్ర విద్యుత్‌ ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ తీసుకొనకపోయినా, ఏడాదికి రూ.500 కోట్ల స్థిర చార్జీలను తాము చెల్లించాల్సి వస్తుందని డిస్కాములు కమిషన్కు నివేదించాయి. పిపిఎలకు అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుల నుండి కొనని విద్యుత్కు స్థిర చార్జీలను చెల్లి ంచాల్సిన బాధ్యత ఉత్పన్నం కాదని కమిషన్‌ పేర్కొంది. ఈ పరస్పర విరుద్ధమైన వైఖరులు ఎలాంటి వివాదాలకు దారి తీస్తాయో చూడాల్సివుంది.

ఎం. వేణుగోపాలరావు