పంద్రాగస్టు నుంచి పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి : కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని పంచాయతీలూ డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పంచాయితీలన్నీ యుపిఐ ఆధారిత చెల్లింపులకు అనువైనవిగా ప్రకటించి, అదే రోజు నుంచి డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాసింది. వివిధ రకాల అభివృద్ధి పనులకు చెల్లింపులు, రెవెన్యూ బిల్లుల సేకరణ అన్నీ కూడా డిజిటల్ పద్ధతిలోనూ జరగాలని నిర్దేశించనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించి స్వాతంత్య్ర దినోత్సవం రోజున అన్ని పంచాయితీలు ఈ మేరకు ప్రకటన చేయాలని సూచించింది. ఇప్పటికే 98 శాతం పంచాయితీలు యుపిఐ ఆధారిత చెల్లింపులు చేస్తున్నట్లు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ చెప్పారు.










