హైదరాబాద్ : '' బిఆర్‌ఎస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని బిజెపి చెప్పినప్పుడు... బిజెపి ప్రతిపాదనను బిఆర్‌ఎస్ మరుక్షణమే తోసిపుచ్చింది '' అని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. మంగళవారం ఇందూరు జనగర్జన సభలో ప్రధాని మోడి మాట్లాడుతూ .... బిఆర్‌ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
డిపాజిట్ కూడా రాని బిజెపితో ఎలా కలుస్తాం : మంత్రి కెటిఆర్
'' విపక్షాలు సైద్ధాంతిక విభేదాలు పక్కన పెట్టి మరీ కలిసి పనిచేశాయి. బిఆర్‌ఎస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని బిజెపి చెప్పింది. 2018లోనే ఆ పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంకేతాలు పంపారు. ఢిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే ఆయన అలా మాట్లాడారా ? బిజెపి ప్రతిపాదనను బిఆర్‌ఎస్ మరుక్షణమే తోసిపుచ్చింది. 105 స్థానాల్లో డిపాజిట్ కూడా రాని బిజెపి తో బిఆర్‌ఎస్ ఎందుకు కలుస్తుంది ? మేం పోరాడేవాళ్లమే తప్ప మోసం చేసే వాళ్లం కాదు '' అని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమతో పొత్తు కోసం ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. తమ బాస్ కెసిఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. విపక్షాలు మాత్రం కెసిఆర్‌ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని విమర్శించారు.
ఇందూరు జనగర్జన సభలో ప్రధాని మోడి వ్యాఖ్యలు....
'' మీకో రహస్యాన్ని చెప్పబోతున్నా.. చెప్పమంటారా..? ఇప్పటి వరకు దాన్ని ఎప్పుడు చెప్పలేదు.. ఇప్పుడు చెప్పుతున్నా'.. అంటూ... ప్రధాని మోడి పలు వ్యాఖ్యలు చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 48 సీట్లు బిజెపి గెలిచింది. అన్ని సీట్లు మేము గెలుస్తారని వారు ఊహించలేదు. అప్పుడు కేసీఆర్‌కు సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను ఎయిర్ పోర్ట్‌కు వస్తే పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని, గజమాలలు తీసుకుని స్వాగతం పలికేందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదో తెలుసా..? కెసిఆర్.. నన్ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చారు.. పెద్ద పెద్ద శాలువాలు తెచ్చారు.. అప్పుడు ఎంతో బాగా ఆదరించారు, ఎంతో ప్రేమ చూపించారు. అయితే ఇది కెసిఆర్ క్యారెక్టర్ కాదని నేను అప్పుడే అనుకున్నా. కెసిఆర్ ఎన్డీఏలో భాగస్వామిగా అవుతామని నాతో చెప్పాడు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సహకారం అందించాలని కోరారు. కానీ కెసిఆర్ చేసిన ప్రతిపాదనకు నేను ఒప్పుకోలేదు... నేను మీతో జతకట్టబోనని చెప్పా '' అని ప్రధాని మోడి విమర్శించారు.
'' హైదరాబాద్ లో విపక్షంలో కూర్చోవాలన్నా కూర్చుంటాం.. కెసిఆర్ సర్కార్ మా కార్యకర్తలపై జులుం చేసినా సహిస్తాం.. కానీ తెలంగాణ ప్రజలను దగా చేయనివ్వం. అలాగే కెసిఆర్‌ను ఎన్డీఏలో ఎంట్రీకి కూడా నేను నిరాకరించా. నేను బీఆర్‌ఎస్ అవినీతిపై ప్రశ్నించడం ప్రారంభించడంతో అప్పటి నుంచి కెసిఆర్ దూరంగా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా ఒకట్రెండు సార్లు కెసిఆర్ నన్ను కలిశారు.. ఇక నేను తప్పుకోవాలనుకుంటున్నా.. నా కొడుకు కెటిఆర్‌కు బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నానని నాతో చెప్పారు. కెటిఆర్‌ను మీ వద్దకు పంపిస్తాను.. మీరు ఆశీర్వదించాలని నన్ను కోరారు. ఇది ఆయనే నాతో స్వయంగా చెప్పారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను. నువ్వేమైనా రాజువా.. మహరాజువా.. నీ తర్వాత నీ కొడుకు కూర్చోవడానికి.. అని ప్రశ్నించాను. ఎవరిని కూర్చోబెట్టాలో అని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారని.. చెప్పినప్పటి నుంచి కెసిఆర్ నన్ను కలవడం లేదు. కనీసం నా కళ్లలోకి చూసే సాహసం కూడా చేయడం లేదు.. మీడియా వాళ్లు కూడా తేదీలు చెక్ చేసుకోవచ్చు '' అని ప్రధాని మోడి వ్యాఖ్యానించారు.










