Sep 20,2023 21:57
  •  ఇప్పటికీ జనసేనతో పొత్తులో ఉన్నాం : పురంధేశ్వరి

ప్రజాశక్తి - ఏలూరు : ఎన్నికల పొత్తులకు సంబంధించి రెండు, మూడు నెలల ముందు నిర్ణయిస్తామని, ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఏలూరులోని సుఖీభవ కల్యాణ మండపంలో ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు చారిత్రాత్మకమైనదని, 2027 నుంచి బిల్లు అమల్లోకి వస్తుందని తెలిపారు. టిడిపితో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో పవన్‌ చెప్పారని, ఆయన నిర్ణయంపై తమ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. చంద్రబాబుపై కేసు వేసింది తాము కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేంద్రమే ఇస్తోందని, విడుదల చేసిన నిధులను రాష్ట్రం సక్రమంగా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యంపై సిబిఐకి లేఖ రాస్తానన్నారు. విశ్వకర్మ యోజన ద్వారా 18 చేతివృత్తుల వారికి లబ్ది జరగనుందని, రూ.13 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా వైద్య సహాయం పొందొవచ్చని చెప్పారు. రూ.5 లక్షల వరకూ వైద్య ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.