నవంబర్‌లో 75 శాతం పతనం
21 నెలల కనిష్టానికి చేరిక
ముంబయి : ప్రజల ఆదాయ మార్గాలు పడిపోవడంతో మ్యూచువల్ ఫండ్లలోనూ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో ఒపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర నిధులు 75 శాతం పడిపోయి రూ.2,258 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులు 21 నెలల కనిష్టానికి దిగజారాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (అంపీ) గణంకాలు తెలిపాయి. ఇంతక్రితం అక్టోబర్‌లో ఈ రంగంలో రూ.9,390 కోట్ల పెట్టుబడులు చోటు చేసుకున్నాయి. ఇన్వెస్టర్లు ఎంఎఫ్‌ల్లో ఉన్న వాటాలను అమ్ముకోవడం ద్వారా లాభాల స్వీకరణకు ఆసక్తి చూపుతున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ అనలిస్ట్ మేనేజర్ మెల్విన్ పేర్కొన్నారు. పెద్ద ఈక్విటీ క్యాప్స్‌ల్లో నిధుల ఉపసంహరణ ఎక్కువగా ఉందన్నారు. 2022 నవంబర్ ముగింపు నాటికి మ్యూచువల్ ఫండ్లలో అసెట్ అండర్ మేనేజిమెంట్ (ఎయుఎం) దాదాపు రూ.40 లక్షల కోట్ల మైలురాయిని చేరడం విశేషం. అక్టోబర్‌లో ఇది రూ.39.50 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన నెలలో సిప్‌ల్లో రూ.13,307 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇంతక్రితం అక్టోబర్ నెలలో తొలిసారిగా సిప్ పెట్టుబడులు రూ.13,000 కోట్ల మార్క్‌ను దాటాయి.










