- తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన చైర్మన్ భూమన
ప్రజాశక్తి- తిరుమల : అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వచ్చే మార్గంలో వన్యమృగాల నుంచి ఎలాంటి ముప్పూ లేదని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. యాత్రికుల భద్రతే తమకు ముఖ్యమని అన్నారు. యాత్రికుల రద్దీ నేపథ్యంలో క్యూలైన్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా? లేదా? అని యాత్రికులను అడిగి తెలుసుకున్నారు. గోగర్భం సర్కిల్ నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో టిటిడి చైర్మన్ మాట్లాడారు. పెరటాశి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగిందన్నారు. యాత్రికులు త్వరగా శ్రీవారిని దర్శించుకునేందుకు విఐపి బ్రేక్, సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీని రద్దు చేశామని చెప్పారు. అక్టోబరు 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో యాత్రికులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంటున్నామని తెలిపారు. ఆయన వెంట జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్‌వి నరసింహ కిషోర్, డిప్యూటీ ఇఒ రాజేంద్ర, తదితరులు ఉన్నారు.










