హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ సమితి నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. ఈరోజు మధ్యాహ్నం వరకు మాత్రమే గణపతి దర్శనం ఉండటంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా జనసందోహంతో నిండిపోయింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య బడా గణేశుడి శోభా యాత్ర ఉంటుంది. ముందుగా మండపాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఈ అర్ధరాత్రి లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది. మరోవైపు బడా గణేశ్ ఊరేగింపు, నిమజ్జనం కోసం రాజధాని నగరంలో రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించనున్నారు.










