Jan 27,2023 20:08

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాలో ఉన్న లోపాలను సరిచేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజ శర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఎపి చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఆ వివరాలను విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. డిసెంబర్‌ 30న విడుదల చేసిన ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాలో అభ్యంతరకరమైన అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. అనేక మంది పేర్లు అర్హత లేకపోయినా జాబితాలో పొందుపరచబడ్డాయన్నారు. అర్హత లేని ఐదు, ఏడు, పదో తరగతి. ఇంటర్‌, డిప్లొమో చదివిన వారు, ఆఖరుకు నిరక్షరాస్యుల పేర్లు సైతం జాబితాలో నమోదయ్యాయని తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఇలా తన దృష్టికి 1752 పేర్లు వచ్చాయని వెల్లడిచారు. బూత్‌ నెంబర్‌ 216 లోని శరత్‌ కుమార్‌ నారాయణశెట్టి పేరును వరుసగా ఐదు సార్లు ఓటర్‌ లిస్టులో చేర్చారన్నారు. ఇలా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 4069 పేర్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఒక మండలానికి సంబంధించిన పేర్లు మరొక మండలానికి చెందిన జాబితాలో ఉన్నాయని తెలిపారు. భౌతికంగానూ, ఆన్‌లైన్‌ ద్వారానూ ఫారం 18 ద్వారా అప్లికేషన్‌ ఇచ్చిన అనేకమంది పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు కాలేదన్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలను గత ఏడాది డిసెంబర్‌ 3న తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాటిని సరిచేయకుండా తుది జాబితా విడుదల చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి లోపాలను సరిచేయాలని కోరారు. డిసెంబర్‌ తొమ్మిది గడువులోగా అప్లికేషన్‌ ఇచ్చిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.