May 02,2023 08:08
  • మోడీ ప్రభుత్వాన్ని సాగనంపే వరకూ పోరాటం
  • మేడే, ప్రచార భేరి ముగింపు సభలో ఎంఎ బేబి, కె నారాయణ

ప్రజాశక్తి- ప్రతినిధి నెల్లూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్‌ శక్తులకు ప్రతినిధిగా వ్యవహరిస్తూ వాటికి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెడుతున్నారని, సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపే వరకు పోరాటం సాగించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. 'మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి, దేశాన్ని కాపాడాలి' అంటూ గత నెల 14 నుంచి 30 వరకు నిర్వహించిన ప్రచార భేరి ముగిసింది. ఈ సందర్భాన్ని, మేడేని పురస్కరించుకొని సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరులో సోమవారం భారీ ర్యాలీ, బహిరంగ సభ జరిగాయి. బహిరంగ సభలో ఎంఎ బేబి మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వంలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని తెలిపారు. కేరళలోని పేపర్‌ మిల్లును ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తే, దానిని కేరళ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కేరళలోని విమానాశ్రయాన్ని ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తే తామే కొనుగోలు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కేంద్రం వినలేదన్నారు. ఎపిలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుండడం శోచనీయమన్నారు. చికాగో నగరంలో కార్మిక పోరాట ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని మోడీ ప్రభుత్వం జిఒలతో కాలరాస్తోందని విమర్శించారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి పని గంటలను 12 గంటలు చేస్తే, కార్మికులు సంఘటితంగా తిప్పికొట్టారన్నారు. పాలకులకు విన్నపాలు వినపడవని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని అన్నారు.
         సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశ ప్రజల కోసం కాకుండా 30 మంది కార్పొరేట్‌ శక్తుల కోసం మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు. వీరిలో ఒక్క విజరుమాల్యా మినహా అందరూ గుజరాత్‌కు చెందిన మోడీ మిత్రులేనన్నారు. అదానీకి దేశంలోని పోర్టులు, విమానాశ్రయాలు, మైన్స్‌ మొత్తం కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెంచి సామాన్యుల జీవితాలు అతలాకుతలం చేశారని విమర్శించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేశ సరిహద్దులో సమస్యలు సృష్టించి, మతోన్మాదం రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి తూట్లు పొడవడంతోపాటు సిబిఐ, ఎన్నికల సంఘం, కోర్టులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను తీవ్రంగా మోసగిస్తోందని విమర్శించారు. కేసుల నుంచి బయటపడడానికే మోడీకి జగన్‌ దాసోహం అయ్యారని ఆరోపించారు.
      సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, మేడే దీక్షా దినమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వాని సాగనంపుతామని, దేశాన్ని రక్షించడానికి ప్రచారభేరి నిర్వహించామన్నారు. ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు మోడీని భరించామని, ఇక ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. దేశంలో ప్రతిపక్షాలకు మాట్లాడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేశారని విమర్శించారు. కేరళకు చెందిన సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌కు నోటీసులు జారీ చేశారన్నారు. ప్రపంచమంతా మేడే జరుపుకుంటోందని, మేడే సందర్భంగా కార్మికులకు మోడీ కనీసం శుభాకాంక్షలు చెప్పలేదన్నారు. ఢిల్లీలో రెజ్లర్లు ఎనిమిది రోజులుగా పోరాడుతున్నా రాష్ట్రపతి, ప్రధాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో బిజెపికి ఏమీ లేదని చెబుతున్నారని, వైసిపి, టిడిపి, జనసేన ప్రాణం పోస్తున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులు ఇక్కడ కుస్తీపడుతూ ఢిల్లీ వెళ్లి దోస్తీ చేస్తున్నారన్నారు. బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య అధ్యక్షత వహించారు.