ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నేర విచారణ నేపథ్యంలో కోర్టులకు సహాయకారిగా వుండేలా అమలు చేస్తున్న కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానం సత్ఫలితాలను ఇస్తోందని డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో ఈ విధానంతో 122 కేసుల్లో 109 కేసులకు విచారణ పూర్తయి శిక్షలు పడ్డాయని అన్నారు. నెల్లూరు పట్టణంలో 2022లో జరిగిన దర్గా ముజావర్ హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు విధించిన నేపథ్యంలో డిజిపి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దర్గా ముజావర్ హత్యకేసులో నిందితుడికి 11 నెలల్లో శిక్ష పడిందని అన్నారు. కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని గతేడాది నుండి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విధానంలో నేరాల తీవ్రతను గుర్తించిన పోక్సో లాంటి 122 కేసులను విచారించామన్నారు. 109 కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు. ఇందులో 39 జీవిత ఖైదు, మిగిలిన 66 కేసుల్లో ఏడేళ్ల నుండి 20 ఏళ్లదాకా శిక్షలు పడ్డాయని తెలిపారు.










