Jun 29,2023 20:15

ప్రజాశక్తి-అనంతపురం:పోలీసు శాఖలో పని చేసే ప్రతి ఒక్కరూ అంకిత భావంతో విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర డిజిపి కెవి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అనంతపురంలోని పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ డిఎస్‌పిలతో గురువారం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమాజం, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలా వ్యహరించాలి.. ప్రజలకు అందించాల్సిన సేవలు.. విధినిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావం, పారదర్శకత, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు. ఇటీవల పెరిగిపోతున్న సైబర్‌ నేరాల కట్టడికి కృషి చేయాలని తెలిపారు. మహిళల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పోలీసుశాఖలు కృషి చేస్తున్నాయని, ఆ దిశగా మహిళల రక్షణ కవచంగా దిశ యాప్‌ పని చేస్తోందని చెప్పారు. గంజాయి, తదితర మాదక ద్రవ్యాల నియంత్రణపై ఇప్పటికే పోలీసు శాఖ ఉక్కుపాదం మోపిందన్నారు. మత్తుపదార్థాల అనర్థాలపైనా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం జరగడమే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఐజిపి వెంకట్రామిరెడ్డి, ఎస్‌పి కె.శ్రీనివాసరావుతో పాటు ట్రైనీ డిఎస్‌పిలు పాల్గొన్నారు.