Sep 24,2023 11:36

అమరావతి : చంద్రబాబు నాయుడు అరెస్టు, తదనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో ఆదివారం నారా లోకేష్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున నారా లోకేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ..... చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని నేతలు అభిప్రాయడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని పార్టీ నేతలు ఖండించారు. లోకేష్‌ యువగళం పున: ప్రారంభంపైనా ముఖ్యనేతల సమావేశంలో లోకేష్‌ చర్చించారు.

వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించే యోచనలో నారా లోకేష్‌ ఉన్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు అరెస్ట్‌తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే లోకేష్‌ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్‌ నిత్యం సంప్రదిస్తున్నారు. అటు లీగల్‌ ఫైట్‌ కొనసాగిస్తూ.. ఇటు యువగళం తో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, జగన్‌ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని నారా లోకేష్‌ నిర్ణయించారు.