ప్రజాశక్తి-గన్నవరం :వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. ఈ రోజు వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రారావుతో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో రెండు గంటలకు వీరి సమావేశం కొనసాగింది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను గన్నవరంలోనే ఉన్నానని, ఇక్కడి రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. ''నేను అజ్ఞాతవాసంలో ఉన్నా. రెండేళ్ల నుంచి రాజకీయంగా ఉన్న ఇబ్బందుల వల్ల కార్యకర్తలకు ఏం చేయలేకపోయాను'' అని చెప్పారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు.










