ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అన్ని విధాలా నిర్వీర్యం చేసే కుట్రలు తీవ్రమవుతున్నాయని సిఐటియు విశాఖ జిల్లా కోశాధికారి ఎస్ జ్యోతీశ్వరరావు విమర్శించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 893వ రోజుకు చేరాయి. దీక్షల్లో మల్కాపురం జోన్ కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి జ్యోతీశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమకు తగినంత బొగ్గు సరఫరా చేయకపోవడం, ఆర్థికంగా సహకరించకపోవడం ప్లాంట్‌ను నిర్వీర్యపరిచే కుట్రలో భాగమేనన్నారు. కార్మికులపై పని ఒత్తిడి పెంచారని, సౌకర్యాలు కల్పించడంలేదని, రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యూటీ ఇవ్వడంలేదని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూ కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. కార్మికుల వేజ్ అగ్రిమెంట్‌ను చివరి దశలో ఉక్కు శాఖ మంత్రి ఆమోదించకపోవడంపై మండిపడ్డారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలని, ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత గనులు కేటాయించి, పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని కోరారు.










