Oct 17,2023 20:27

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం):స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు జె.రామకృష్ణ అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 978వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ విభాగానికి చెందిన కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘకాలంగా కార్మిక వర్గం దీక్షలు చేపడుతున్నా మోడీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. పోరాటాల ద్వారా ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపితేనే లాభాల బాట పడుతుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. దీక్షల్లో కార్మికులు సాయిరాం, సైన్‌బాబు, ఆర్‌.వెంకటరావు, వీరాస్వామి, మధు, డి.శ్రీనివాస్‌, మంత్రి రవికిరణ్‌, జయకుమార్‌, చిత్త అబ్బాయి పాల్గొన్నారు.