షాద్‌నగర్: అధికారం ఇచ్చినపుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్ .. ఇవాళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. హామీలతో ప్రలోభపెట్టాలని ఆ పార్టీ చూస్తోందని ఆరోపించారు. మోసాన్ని మోసంతోనే జయించి.. ఓటు బిఆర్‌ఎస్ అభ్యర్థులకు వేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.''బిజెపి వాళ్లకు అదానీ నుంచి బాగా పైసలు వస్తున్నాయట. కాంగ్రెస్, బిజెపి వాళ్లను దబాయించి పైసలు అడగండి. రైతుబంధు అందితేనే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వస్తేనే మాకు ఓటేయండి. తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్.. తెచ్చేది అంజయ్య యాదవ్. కాంగ్రెసోళ్లు కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర్‌మెంట్ పెడతారు. బిజెపి వాళ్లు నీళ్ల వాటా తేల్చరు.. కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులపై కేసులేసి ఇబ్బంది పెడతారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని కాంగ్రెస్ నేతలే చెప్పారు. ఈ విషయంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ సోనియాగాంధీకి లేఖ రాశారు. రేవంత్ బిజెపితో కలిసి పోయారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బిజెపిలోకి జంప్ అవుతారు'' అని కేటీఆర్ విమర్శించారు.










