Oct 07,2023 22:19

ప్రజాశక్తి- నూజివీడు రూరల్‌ (ఏలూరు జిల్లా) : 'నీళ్ల చారు. లావు బియ్యం అన్నం. పులిసిన పెరుగు. నాణ్యతలేని కూరలు తినలేకపోతున్నాం. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మాకు నాణ్యమైన భోజనం పెట్టండి' అంటూ నూజివీడు ట్రిపుల్‌ ఐటి విద్యార్థులు శనివారం ఆ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. తమకు నాణ్యమైన పౌష్టికాహారం అందించే చర్యలు చేపట్టే వరకూ ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమకు లావు బియ్యంతో భోజనం పెడుతున్నారని, దీంతో, అన్నం చిమిడిపోతోందని, దీన్ని తినలేకపోతున్నామని తెలిపారు. ఒక్కో విద్యార్థికీ భోజనం నిమిత్తం రూ.90 నుంచి 110 వరకూ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆ మొత్తంతో నాణ్యమైన, పౌష్టికాహారం అందించవచ్చని, కానీ కాంట్రాక్టర్‌ నాసిరకం కూరగాయలు, బియ్యంతో భోజనం వండి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ భోజనం తినడం వల్ల తరచూ అనారోగ్యానికి పాలవుతున్నామని, కొన్ని సందర్భాల్లో పస్తులు ఉంటున్నామని వాపోయారు. ఇక్కడ భోజనం తినలేక తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంపస్‌లో ఉన్న మరో ప్రయివేటు క్యాంటిన్‌లో భోజనం చేస్తున్నామని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ కళాశాలలో భోజనం, ఫ్యాకల్టీ సరిగా లేకపోవడం, విద్యాబోధనలో ఒత్తిడి వల్ల గతంలో 20 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, దీనిపై విచారణ చేపట్టాలని కోరినా కనీసం పట్టించుకోవడం లేదని తెలిపారు.

dharna

ఎస్‌ఎఫ్‌ఐ, సిపిఎం మద్దతు

విద్యార్థుల ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్‌ మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ఆందోళన చేపట్టామని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశామని, అయినా కనీసం పట్టించుకోలేదని అన్నారు. మెస్‌ నిర్వహణ సరిగా లేదని తెలిపారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

మెస్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని అధికారుల హామీ

విద్యార్థుల ఆందోళనతో స్పందించిన నూజివీడు సబ్‌కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. భోజనశాలను పరిశీలించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామన్నారు. కళాశాల డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ భోజనం నాణ్యతపై మెస్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కమిటీలో మెంబర్లతో పాటు విద్యార్థులు కూడా ఉంటారని ప్రకటించారు. నిత్యం మెస్‌లో ఆహారాన్ని తనిఖీ చేస్తామని, నాణ్యతా ప్రమాణాలతో భోజనం అందించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో, విద్యార్థులు ఆందోళన విరమించారు.