Jul 13,2023 11:28
  •  తెలంగాణ విద్యా వ్యవస్థపై బొత్స కామెంట్స్‌

ప్రజాశక్తి-అమరావతి: ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ... ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని అన్నారు. అర్హులైన వారికి ఈ నెల 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,400 సీట్లు ఉన్నాయని.. వీటి కోసం 38,355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఒక్కో క్యాంపస్‌ లో 1100 సీట్లను భర్తీ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని ఆరోపించారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది అని విమర్శలు గుప్పించారు.
వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. పవన్‌ చేసిన ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పవన్‌ కల్యాణ్‌ గాలి మాటలపై పొద్దున్నే తమకేందుకు ఈ రచ్చ అని ప్రశ్నించారు. పవన్‌ మాటలను పట్టించుకోకుంటేనే మంచిదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్భుద్దితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స విమర్శించారు. పవన్‌ ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థకు ఎంతో మంచి గుర్తింపు ఉందని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ విధివిధానాలు ఏమిటో పవన్‌ కల్యాణ్‌కు తెలుసా? అని ప్రశ్నించారు.