ఐసిసి వన్డే ప్రపంచకప్ క్వాలిఫై టోర్నీ
హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్ క్వాలిఫై టోర్నీలో లీగ్ దశ ముగిసింది. గ్రూప్‌ాఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్ జట్లు సూపర్6కు అర్హత సాధించాయి. మంగళవారం జరిగిన గ్రూప్-బి ఆఖరి లీగ్ మ్యాచుల్లో శ్రీలంక జట్టు 82పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై నెగ్గి ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245పరుగులకు ఆలౌటైంది. నిస్సంక(75), అసలంక(63) అర్ధసెంచరీలతో రాణించారు. గ్రేవ్స్‌కు నాలుగు, వాల్ట్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో స్కాట్లాండ్ జట్టు 29 ఓవర్లలో 163పరుగులకు ఆలౌటైంది. గ్రీవ్స్(56) మాత్రమే అర్ధసెంచరీతో మెరిసాడు. తీక్షణకు మూడు, హసరంగకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీక్షణకు లభించింది. మరో నామమాత్రపు మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు 138పరుగుల తేడాతో యుఏఇపై విజయం సాధించింది. ఐర్లాండ్ 50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 349పరుగులు చేయగా.. యుఏఇ జట్టు 39 ఓవర్లలో 211పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టెర్లింగ్‌కు లభించింది. ఈ టోర్నీలో ఐర్లాండ్ జట్టుకు దక్కిన ఏకైక విజయం ఇదే. నేటితో ముగిసిన లీగ్ దశ అనంతరం నేపాల్, అమెరికా, ఐర్లాండ్, యుఏఇ జట్లు ఇంటిదారి పట్టాయి. ఇక గురువారం(29)నుంచి సూపర్6 పోటీలు ప్రారంభం కానున్నాయి.










