బి.కొత్తకోట-రాయచోటి (అన్నమయ్య) : బి.కొత్తకోట శాఖా గ్రంధాలయము వద్ద గత నెల 8వ తేదీ నుండి ఈనెల 10వ తేదీ వరకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలు ముగిశాయి. శనివారం నిర్వహించిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపిడిఒ శంకరయ్య, ఎంఈఒ రెడ్డి శేఖర్, నగర పంచాయతీ ఎఒ రమాదేవ, మోడ్రన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీను నాయక్, బాలికోన్నత పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భముగా ఎంపీడీవో శంకరయ్య మాట్లాడుతూ ... పిల్లలు చిన్నతనము నుండి గ్రంథాలయాలను వినియోగించుకోవడం వలన ఎంతో విజ్ఞానవంతులు అవుతారని చెప్పారు. ఎంఈఓ రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ... వేసవి సెలవులలో పిల్లలు బయట తిరగకుండా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకున్నందుకు పిల్లలందరినీ అభినందించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శీను నాయక్ మాట్లాడుతూ ... ఈ వేసవి శిక్షణ శిబిరాలు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. బాలికోన్నత పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మాట్లాడుతూ ... సమ్మర్ క్యాంపులో నిర్వహించిన వివిధ రకాల అంశాలు పోటీలు నిత్యజీవితంలో కూడా అవలంబిస్తూ ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి ఎం తులసి నాయక్ మాట్లాడుతూ ... ఇప్పటివరకు వేసవి శిక్షణ శిబిరాలలో పాల్గన్న విద్యార్థినీ విద్యార్థులు అందరికీ గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకోవాలని అలాగే పిల్లల తల్లిదండ్రుల ద్వారా కూడా సభ్యత్వం తీసుకుంటే గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలను విరామ సమయంలో ఇంటి వద్దకు తీసుకెళ్లి చదువుకోవడానికి వీలు అవుతుందని అన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో పిల్లలకు ప్రత్యేకంగా 50 రూపాయలకే సభ్యత్వం కల్పించబడుతుందని తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ఇచ్చారు. ముఖ్య అతిధులతో బహుమతి ప్రదానం చేశామని అన్నారు.