గాజా : మధ్య ధరా సముద్రపు ఒడ్డున ఉన్న ఈ చిన్న భూఖండాన్ని (గాజా స్ట్రిప్)లో 23 లక్షల మంది పాలస్తీనీయులు ఉంటున్నారు. గాజాపై దాడుల తరువాత ఆరున్నర లక్షల మంది పాలస్తీనీయులు ఐరాస సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల్లో ఇంధనం, ఆహార నిల్వలు అడుగంటిపోయాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిపోవడంతో ఈ ప్రాంతంలో పూర్తి అంధకారం నెలకొంది. ఈ సంక్షోభాన్ని తన ఆధిపత్యాన్ని తిరిగి పటిష్టపరచుకోడానికి ఎలా వాడుకోవాలా అన్నదాని గురించి అమెరికా పన్నాగాలు పన్నుతున్నది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ అమెరికాను ఎగదోసేలా బహిరంగంగానే ఇలా వ్యాఖ్యానించింది. ' ఈ యుద్ధం అమెరికా తాను పట్టుకోల్పోతున్న ప్రాంతంపై తిరిగి తన పట్టును నిలుపుకోడానికి ఇదొక గడ్డు పరీక్ష ' అని పేర్కొంది. సిరియా, ఇరాక్‌పై అమెరికా బాంబు దాడులకు దిగడం ఈ ఆధిపత్య వ్యూహంలో భాగమే. ఈ చర్యను సమర్థించుకోడానికి అక్కడి తన సైనికులపై ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని, దానికి ప్రతిగానే ఈ దాడులు అని అమెరికా చెబుతోంది. నిజానికి అక్కడ అమెరికా సైనికులు ఎవరూ లేరు. నిన్న మొన్నటి వరకు బద్ధ విరోధులుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ చైనా మధ్యవర్తిత్వంలో ఒక్కటవ్వడంతో ఇజ్రాయిల్ ఒంటరిపాటైంది. ఈ పరిస్థితిలో సిరియా, ఇరాన్, లెబననాన్లను ప్రాంతీయ యుద్ధంలోకి లాగాలని అమెరికా చూస్తోంది.