- అనంతపురం పంటల బీమా అక్రమాలపై క్లీన్‌చిట్
- సిఎంఒ ఆదేశాలు బేఖాతరు
- చేతివాటంతోనే..
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం పంపిణీలో అక్రమాలపై ఉమ్మడి అనంతపురంలో చేపట్టిన విచారణ ఫార్స్‌గా తయారైంది. 2021 ఖరీఫ్‌లో సంభవించిన పంట నష్టాలపై ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించిన ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) సమగ్ర దర్యాప్తునకు ఆదేశించగా, అధికారులు తూతూమంత్రంగా విచారించి అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చేశారు. కొంత మంది విచారణాధికారులు చేతివాటం ప్రదర్శించి అవినీతి జరగలేదని సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇ-క్రాప్, ఇ-కెవైసి నమోదుల్లో ఉద్దేశపూర్వకంగా అనర్హులను చేర్చడం వలన ఇన్సూరెన్స్ సొమ్ము పక్కదారి పట్టిందని, అర్హులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో ఉమ్మడి అనంతపురంలో జరిగిన ప్రత్యేక విచారణ ప్రభుత్వంలో, వ్యవసాయశాఖలో చర్చనీయాంశం అయింది.
- ఇ-క్రాప్‌తోనే...
2021 ఖరీఫ్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో విపత్తుల వలన భారీగా పంట నష్టాలు సంభవించడంతో ప్రభుత్వం 2022 జూన్‌లో రూ.855 కోట్ల పరిహారం విడుదల చేసింది. పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ర్యాండమ్‌గా (మచ్చుకు) నిర్వహించిన క్షేత్ర స్థాయి సర్వే ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. విచారణ జరిపించాలంటూ సిఎంఒలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు ఆయన పర్సనల్ సెక్రటరీ ద్వారా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి గత నెల 9న ఆదేశాలు అందాయి. ఎంక్వయిరీ చేయాలంటూ మార్చి 14న ద్వివేది నుంచి వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్‌కు ఆదేశాలు వెళ్లాయి. ర్యాండమ్ చెకింగ్‌లో నిర్ధారించిన వివరాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ వలంటీర్లపై ఆధారపడ్డ ఆర్‌బికెల సిబ్బంది, వారు చెప్పిన వివరాలను ఇ-క్రాప్‌లో ఎక్కించారు. అసలు పంటలు సాగు చేయకుండా బీడుపెట్టిన రైతులు పంటలు సాగు చేసినట్లు రాశారు. కొంత విస్తీర్ణంలో పంటలు వేయగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేసినట్లు రాశారు. ఒక పంట సాగు చేస్తే వేరే పంట నమోదు చేశారు. అప్పట్లో అనంతపురం జిల్లాలో వేరుశనగ, మిర్చి, కంది పంటలకు నష్టం జరిగింది. మిర్చికి సర్కారు హెక్టారుకు రూ.60 వేలు పరిహారం ఇచ్చింది. వేరుశనగ, కందులకు రూ.4 వేలు. సిబ్బంది. కాగా అందరూ వేరుశనగ సాగు చేశారని ఎక్కించారు. పంటల నమోదు తప్పుగా నమోదు చేయడం వలన మిర్చి సాగు చేసిన రైతులకు రూ.4 వేలు వచ్చింది. వేరుశనగ, కంది సాగు చేసిన వారికి ఏకంగా రూ.60 వేలు వచ్చింది. ఈ అవకతవకలు ర్యాండమ్ చెకింగ్‌లో బయట పడ్డాయి. కిందిస్థాయి సిబ్బంది తయారు చేసిన జాబితాలను పర్యవేక్షణాధికారులు నిర్లక్ష్యం వహించి ఆమోదం తెలిపారని తేలింది. ఎక్కడ ఎవరు బాధ్యులో ఎంత సొమ్ము దుర్వినియోగం అయిందో పూర్తి వివరాలు సిఎంఒ నుంచి పంపారు.
- కాసులకు కక్కుర్తి
సాక్షాత్తు సిఎంఒ విచారణకు ఆదేశించినప్పటికీ కిందిస్థాయిలో విచారణ లోపభూయిష్టంగా సాగింది. లంచాలు తీసుకున్న విచారణాధికారులు అసలు తప్పులేమీ జరగలేదని, అంతా సక్రమమేనని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నట్లు సమాచారం. ర్యాండమ్ చెకింగ్‌లో పేర్కొన్న మొత్తం 83 కేసులపై విచారణ జరిపి అంతా ఓకే అంటున్నారు. ఒక డివిజన్‌లో ఆరోపణలొస్తే పక్క డివిజన్ అధికారులు నామ్‌కేవాస్తే దర్యాప్తు చేసి మమ అనిపించారని ఆరోపణలొస్తున్నాయి.










