Oct 04,2023 16:06

నిర్మల్‌ : రైతు రక్షణ కవచం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నిర్మల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో రూ. 714 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ-27 (లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకం)ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పోచంపాడ్‌ వద్ద రూ. 300 కోట్లతో నిర్మించే పామాయిల్‌ పరిశ్రమ నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గని ప్రసంగించారు.ఒకప్పుడు ఎస్సారెస్పీ ఎండిపోయి ఆగమయ్యేది అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మనం రివర్స్‌ పంపింగ్‌ చేపట్టిన తర్వాత ఎస్సారెస్పీ నిండుకుండలా మారింది. సముద్రంలాగా కనబడుతుంది. ఇది కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది. సాగునీటి విషయంలో కష్టాలు తప్పాయి.. కాబట్టి ఓటు వేసే ముందు రైతులు ఆలోచించాలి. 24 గంటల కరెంట్‌ వస్తుందంటే.. రైతుబంధు తీసుకొని ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నాడంటే అందుకు కేసీఆర్‌ కారణం. రైతుబీమాతో రైతుల కుటంబాలను ఆదుకుంటున్నాం. అదే విధంగా కేసీఆర్‌ వడ్లను కొంటున్నాడు. నరేంద్ర మోదీ కొన్నా కొనకపోయినా.. నష్టమొచ్చినా భరిస్తాడనే విశ్వాసం, నమ్మకం రైతులకు ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.నిర్మల్‌, ఆదిఅలాబాద్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల జిల్లాల రైతులు పండించిన ఆయిల్‌ పామ్‌ పంటను ఈ ఫ్యాక్టరీ వాళ్లు కొని ప్రాసెస్‌ చేస్తారు. 35 ఏండ్ల వరకు ఢోకా లేదు. నెలకు జీతం తీసుకున్నట్టే రూ. 12 వేలు బ్రహ్మాండంగా నెల నెల ముడుతాయి. అప్పుడప్పుడు ఎక్కువ కూడా రావొచ్చు. సంవత్సరానికి ఎకరానికి లక్షన్నర ఆదాయం ఆయిల్‌ పామ్‌ రైతులకు వచ్చే అవకాశం ఉంది. ఆయిల్‌ పామ్‌ పంటకు కోతులు, పందుల బెడద ఉండదు. ఈ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అయింది అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.