Jun 21,2023 21:37

బెంగళూరు: శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిసాడు. దీంతో భారతజట్టు 4-0గోల్స్‌తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికే భారత్‌ 2-0గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభంలోనే భారత స్ట్రయికర్‌ స్ట్రిమక్‌ రెడ్‌కార్డ్‌కు గురై మైదానాన్ని వీడాడు. తొలి అర్ధభాగంలో రెండు గోల్స్‌ కొట్టిన ఛెత్రీ.. రెండో అర్ధభాగం 74వ ని.లో మరో గోల్‌ కొట్టి హ్యాట్రిక్‌ గోల్స్‌ చేశాడు. 81వ ని.లో అన్వర్‌ మరో గోల్‌ కొట్టి భారత్‌ ఆధిక్యాన్ని 4-0కు పెంచాడు. హ్యాట్రిక్‌తో ఛెత్రీ అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానానికి ఎగబాకాడు. ఆసియాఖండంలో ఛెత్రీ 138మ్యాచుల్లో 90గోల్స్‌తో ప్రథమస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత మొక్తర్‌ దహరి(మలేషియా) 89గోల్స్‌తో రెండోస్థానంలో ఉన్నాడు.
టాప్‌-5 గోల్‌ స్కోరర్స్‌..
1. క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్‌) 200మ్యాచుల్లో 123గోల్స్‌
2. అలీ డెయి(ఇరాన్‌) 148మ్యాచుల్లో 109గోల్స్‌
3. లియెనెల్‌ మెస్సీ(అర్జెంటీనా) 173మ్యాచుల్లో 103గోల్స్‌
4. సునీల్‌ ఛెత్రీ(భారత్‌) 138మ్యాచుల్లో 90గోల్స్‌
5. మొక్తర్‌ దహరి(మలేషియా) 142మ్యాచుల్లో 89గోల్స్‌