Jun 25,2023 10:14
  • నేపాల్‌పై 2-0 గోల్స్‌తో నెగ్గిన భారత్‌

బెంగళూరు : శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ సెమీఫైనల్లోకి భారతజట్టు దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్‌-ఏ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2-0గోల్స్‌ తేడాతో నేపాల్‌ను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీ కంఠీరవ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రథమార్థం ముగిసే సరికి ఇరుజట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో తొలి అర్ధబాగం ముగిసేసరికి ఇరుజట్లు 0-0తో సమంగా నిలిచాయి. తొలి అర్ధభాగంలో ఒకటి, రెండుసార్లు ఛెత్రీ సేనకు గోల్‌ చేసే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక పోయింది. రెండోఅర్ధభాగం 61వ ని.లో ఛెత్రీ ఒక గోల్‌ కొట్టడంతో భారత్‌ 1-0 ఆధిక్యతను సాధిం చింది. ఆ తర్వాత 70వ ని.లో సోరెమ్‌ మహేష్‌ సింగ్‌ మరో గోల్‌ కొట్టాడు. దీంతో భారత్‌ 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. భారత్‌కు నాలుగు కార్నర్‌లు లభించగా.. 63శాతం బంతి భారత ఆట గాళ్ల చేతుల్లోనే ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న కువైట్‌ జట్టు పాకిస్తాన్‌పై విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాయి. జట్టు కోచ్‌ ఇగోర్‌ స్టిమాక్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం దృష్ట్యా బుర్లీ క్రొయాట్‌ ఆ బాధ్యతల్లో కొనసాగనున్నాడు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 101వ, నేపాల్‌ 174వ స్థానాల్లో ఉన్నాయి. ఇక తొలి మ్యాచ్‌లో నేపాల్‌ 1-3గోల్స్‌ తేడాతో కువైట్‌ చేతిలో ఓటమిపాలుకాగా.. భారతజట్టు 4-0తో పాకిస్తాన్‌పై గెలిచిన ఉత్సాహంతో బరిలో దిగాయి. ఈ గెలుపుతో భారత్‌, కువైట్‌ 6పాయింట్ల తో తొలి రెండు స్థానాల్లో నిలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సెమీస్‌కు చేరాయి. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ పటిష్ట కువైట్‌తో తలపడనుంది.