Feb 17,2023 22:15

ముంబయి: బిసిసిఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్న బిసిసిఐ సెక్రటరీ జై షాకు లేఖ రాశారు. ఆయన రాజీనామాను బిసిసిఐ కూడా ఆమోదించినట్లు సమాచారం. టీమిండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌పై ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెను దుమారం రేపడం చేతన్‌ శర్మ రాజీనామా కారణంగా తెలుస్తోంది. చేతన్‌ శర్మ ఇటీవల భారత జట్టులో నెలకొన్న పరిస్థితులపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కొందరు భారత క్రికెటర్లు ఫిట్‌గా లేనప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటున్నారని, వారు తీసుకుంటున్న ఇంజక్షన్లను డోపింగ్‌ పరీక్షల్లో సైతం గుర్తించలేరని తెలిపాడు. 80 శాతం ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్‌లకు ముందు ఇంజక్షన్లు తీసుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లుగా చూపి మ్యాచ్‌లు ఆడుతున్నట్లు చేతన్‌ శర్మ ఆరోపించాడు. అలాగే బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని, టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయని.. వాటికి కోహ్లీ, రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నాడు.