- కోల్‌కతాపై 49 పరుగులతో గెలుపు
కోల్‌కతా : ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. దీంతో చెన్నై జట్టు 49 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో జాసన్ రారు (61 పరుగులు), రింకూ సింగ్ (53) మాత్రమే అర్థ సెంచరీలతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు నిరాశ పరిచారు. వీరిలో ఆరుగురు కనీసం రెండెంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో కోల్‌కతాకు పరాభవం తప్పలేదు. ఈ మాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35 పరుగులు)తో మొదలైన విధ్వంసం చివరి వరకు కొనసాగింది. కాన్వే, రహానే, దూబే, జడేజా క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే చెలరేగిపోయారు. బ్యాట్‌తో శివాలెత్తిపోయారు. పరుగుల వర్షం కురిపించారు.ఈ మ్యాచ్‌లో మొత్తం ముగ్గురు అర్ధ సెంచరీలు చేశారు. కాన్వే 56 (40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అజింక్య రహానే 71 ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివం దూబే 50 (21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 8 బంతులు ఆడి రెండు సిక్సర్లతో 18 పరుగులు చేశారు. ధోని రెండు పరుగులతో అజేయంగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో కుల్వంత్ ఛేజ్రోలియా 2 వికెట్లు సాధించారు. రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.










