Jul 29,2022 08:37
  • రైట్‌ ఆఫ్‌ యూజ్‌ పేరుతో రైతుల నుంచి భూసేకరణ
  • భారీ వృక్షాలు, నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు
  • మార్కెట్‌ రేటుపై పది శాతమే చెల్లిస్తామంటున్న కంపెనీ

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) రైతుల నుంచి కారుచౌకగా భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రైట్‌ ఆఫ్‌ యూజ్‌ పేరుతో భూములకు నామమాత్రపు ధర చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. అప్పుడెప్పుడో 1962 నాటి పిఅండ్‌ఎం యాక్ట్‌ (పెట్రోలియం, మినరల్స్‌ పైపులైన్స్‌ చట్టం) మేరకు పరిహారం ఇస్తామంటూ చెప్తోంది. రైతుల నుంచి భూములను తీసుకోవడం లేదు కాబట్టి, పైపు వేసేందుకు మాత్రమే పరిహారం చెల్లిస్తామని అంటోంది. పైపులైన్‌ వేశాక ఆ భూములు దేనికీ పనికి రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
      శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని అంగుల్‌ వరకు 690 కిలోమీటర్ల మేర నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మాణ పనులను 2017లో ప్రతిపాదించగా, గతేడాది నుంచి గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) పైపులైన్‌ పనుల ప్రక్రియను ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదీష్‌పూర్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హాల్దియా వరకు నిర్మించనున్న ఫేజ్‌-2 ప్రాజెక్టుతో పాటు శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు 356 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ప్రాజెక్టులకు దీన్ని అనుసంధానించనున్నారు. ఒడిశాలోని బరంపురం, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో పారిశ్రామిక, వాణిజ్య, కమర్షియల్‌ అవసరాల కోసం పైపులైన్‌ నిర్మిస్తున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాల్లో శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, పలాస, మెళియపుట్టి, మందాస, సోంపేట, కంచిలి మండలాల్లోని 99 గ్రామాల గుండా 600 మంది రైతుల నుంచి సుమారు ఆరు వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. రైట్‌ ఆఫ్‌ యూజ్‌ (వినియోగించుకునే హక్కు) పేరుతో నామమాత్రంగా భూములకు ధర చెల్లించడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూములు సేకరిస్తున్న ప్రాంతంలో మూడేళ్లుగా జరిగిన క్రయ విక్రయాలను రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి తీసుకుని వాటికి సరాసరి కడుతున్నారు. వచ్చిన విలువకు ఒకటిన్నర రెట్లు విలువ కడుతున్నారు. ఆ విధంగా లెక్కించిన మొత్తంపై 10 శాతం చెల్లిస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సెంటు రూ.లక్ష విలువ చేసే భూమికి కేవలం రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల మధ్యే దక్కుతోంది. పరిహారం డబ్బులు చాలా తక్కువగా ఉండడంతో, రైతులు డబ్బులు తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు.
 

                                                                      పడిపోయిన భూముల రేట్లు

పొలాల్లో పైపులైన్‌ కోసం రైతుల నుంచి 60 అడుగుల భూమిని తీసుకుంటున్నారు. అందులో మూడు అడుగుల వెడల్పు, ఐదడుగుల లోతు మేర పైపులైన్‌ను అమర్చనున్నారు. పైపులైను వేసిన 60 అడుగుల విస్తీర్ణంలో భారీ వృక్షాలు, నిర్మాణాలు, బావుల తవ్వకాలు చేపట్టకూడదని రైతులకు చెప్తున్నారు. పైపులైన్‌ తవ్వకాలకు రాళ్లు పాతిన తర్వాత సంబంధిత రైతులతో పాటు చుట్టుపక్క ప్రాంతాల భూముల రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. క్రయ విక్రయాలు నిలిచిపోయాయి.

                                                                 పరిహారం చెల్లింపుల్లో కేరళ ఆదర్శం

పైపులైన్‌ ప్రాజెక్టులో భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపుల్లో కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. కేరళలో కొచ్చి నుంచి మంగుళూరు వరకు 437 కిలోమీటర్ల మేర గెయిల్‌ పైపులైన్‌ పనులు చేపట్టిన సందర్భంలో భూములు ఇచ్చిన రైతులకు కేరళ ప్రభుత్వం మార్కెట్‌ విలువపై అప్పటి వరకు ఉన్న పరిహారానికి ఐదు నుంచి పది రెట్లకు పెంచి చెల్లించింది.

011