Jul 15,2023 10:22
  • రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలి
  • జీపుజాతాలో రైతు, జీడి రైతు సంఘాల నాయకులు

ప్రజాశక్తి - కవిటి (శ్రీకాకుళం జిల్లా) : మద్దతు ధరలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న జీడి రైతుల గోడు పట్టదా? అని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీడికి మద్దతు ధర కల్పించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన జీపు జాతా శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైంది. రైతు సంఘం సీనియర్‌ నాయకులు పాతిన కృష్ణమూర్తి జెండా ఊపి జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో రూ.14 వేలు పైబడి పలికిన 80 కిలోల జీడి పిక్కల బస్తా ధర నేడు రూ.7,500 నుంచి రూ.ఎనిమిది వేలకు దిగజారిందన్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం, రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జీడికి ఎందుకు మద్దతు ధర ప్రకటించడం లేదని ప్రశ్నించారు. 80 కిలోల జీడి పిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలని, రాష్ట్రంలో జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, జీడి పంట విస్తరణ, నిర్వహణకు గతంలో ఇచ్చిన రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. తొలిరోజు జీపుజాతా కవిటి, సోంపేట మండలాల్లో సాగింది. జాతాలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సంగారు లక్ష్మీనారాయణ, సింహాచలం, టి.పాపారావు, బత్తిన.లక్ష్మీనారాయణ, కొబ్బరి రైతు సంఘం అధ్యక్షులు బల్లెడ జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

                                                      అక్రమ లాకౌట్‌ను వెంటనే ఎత్తేయాలి : సిఐటియు

జీడి పరిశ్రమల అక్రమ లాకౌట్‌ను వెంటనే ఎత్తేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి డిమాండ్‌ చేశారు. జీడి పరిశ్రమల అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలని, కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జీడి కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన మందస మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ బి.పాపారావుకు వినతిపత్రం అందజేశారు.