- ఈ ఏడాది ఇప్పటికే మద్యం ఆదాయం రూ.6,939 కోట్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : మద్య నిషేధం బాటలో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ, ఆదాయం చూస్తే ఇప్పట్లో నిషేధం లేనట్టేనని అధికారులు అంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6,939 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇదే జోరు కొనసాగితే వార్షికారతానికి రూ.28 వేలకోట్లు నుంచి రూ.30 వేలకోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు ఏకంగా రూ.20,896 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2021-22లో ఈ అమ్మకాలు రూ.25,484 కోట్లకు చేరుకున్నాయి. ముందు ఏడాది కన్నా దాదాపు నాలుగున్నర వేల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడైనట్లు తేలింది. కేలండరు ఇయర్ వారీ చూసినా అమ్మకాలు జోరుగానే సాగినట్లు తేలుతోంది. 2020లో ఐఎంఎల్, బీర్ అమ్మకాలు కలిపి రూ.19,977 కోట్ల వరకు జరగ్గా, 2021లో రూ.24,163 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ.13,554 కోట్ల విలువైన మద్యం విక్రయం జరిగినట్లు తేలింది.











